54 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ..వచ్చే అక్టోబర్‌‌‌‌ చివరి నాటికి నిర్మాణం పూర్తి: మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి

54 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ..వచ్చే అక్టోబర్‌‌‌‌ చివరి నాటికి నిర్మాణం పూర్తి: మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి
  •     డిసెంబర్‌‌‌‌లో జరిగే అంతర్జాతీయ సమిట్‌‌ ఈ వర్సిటీలోనే జరిగేలా ప్లాన్‌‌
  •     యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ అభివృద్ధి పనుల పరిశీలన 

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనం అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌‌‌‌ఖాన్ పేట్  సమీపంలో ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. స్కిల్ వర్సిటీ భవన నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని కన్‌‌స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... యుంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని 54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నామని, ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వర్సిటీ నిర్మాణ పనులను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. వచ్చే డిసెంబర్‌‌‌‌లో జరిగే అంతర్జాతీయ సమిట్‌‌ను ఈ స్కిల్ వర్సిటీలోనే నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వర్సిటీలోని బిల్డింగ్స్, సెమినార్ హాళ్లు, బాయ్స్ హాస్టల్, అకాడమిక్ బ్లాక్ త్వరగా పూర్తి చేసి యూనివర్సిటీ ప్రారంభోత్సవంతో పాటు సమిట్‌‌ను విజయవంతంగా నిర్వహించేలా పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. 

ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి అకాడమిక్ బ్లాక్, ల్యాబ్-1, ల్యాబ్-2, గర్ల్స్ హాస్టల్ వంటివి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని తెలిపారు. డిసెంబర్‌‌‌‌లో జరిగే సమిట్‌‌ సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లకు స్కిల్ యూనివర్సిటీ సిద్ధంగా ఉండవచ్చని వైస్ చాన్సలర్ తెలిపారన్నారు. మొదటి ​విద్యా సంవత్సరంలో సుమారు 2,500 మంది విద్యార్థులను జాయిన్ చేసుకోనున్నామని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ సెంటర్లను సరిగ్గా అమలు చేస్తే, దేశంలోనే నైపుణ్యం కలిగిన మానవ వనరుల విభాగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని మంత్రి వివేక్‌‌ చెప్పారు.