కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి : కేంద్రమంత్రి బండి సంజయ్

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి : కేంద్రమంత్రి బండి సంజయ్
  •     గ్రామాల అభివృద్ధికి నిధులిస్తే.. వాటితో జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు
  •     ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లిస్తే ఊరుకోం: కేంద్రమంత్రి బండి సంజయ్
  •     సిరిసిల్లలో కార్గిల్ చెరువు పునరుద్ధరణకు శంకుస్థాపన 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, తెలంగాణ కోసం కేంద్రం 12 ఏండ్లలో రూ. 13 లక్షల కోట్లు ఖర్చు చేసిందని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ పేర్కొన్నారు. భారీగా నిధులిస్తున్నా ‘కేంద్రం ఏమిచ్చింది? తెలంగాణకు అన్యాయం చేస్తోంది’ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. రెండున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. సిరిసిల్లలో అమృత్–2 స్కీం కింద రూ.1.32 కోట్లతో చేపడుతున్న కార్గిల్ చెరువు బ్యూటిఫికేషన్ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెల్లించలేని స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ఉద్దేశంతో నిధులిస్తుందో ఆ పనులకే ఖర్చు చేయాలని సూచించారు. కేంద్రం ఇచ్చే నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.

పట్టణాలను వాటర్ సెక్యూర్ సిటీస్‌‌గా తీర్చిదిద్దడానికి 2015లో మోదీ ప్రభుత్వం అమృత్ స్కీమ్​ ప్రారంభించిందని సంజయ్ తెలిపారు. తెలంగాణకు అమృత్–1లో రూ.1,660 కోట్లు, అమృత్–2లో రూ. 3,429 కోట్లు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌తో పాటు సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలకు ఈ స్కీమ్ కింద దాదాపు రూ.400 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి. గీతే, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.