- నియోజకవర్గాల్లో ‘సర్’ ప్రక్రియ సాగుతున్న తీరుపై చర్చ
- తుంగతుర్తిలో ‘ఈశ్వరమ్మ వర్సెస్ జక్కిడి’ పంచాయితీపై ఆరా
- నామినేటెడ్ పోస్టులు, పార్టీ అంతర్గత
- పరిణామాలపై పీసీసీ చీఫ్‌తో ప్రత్యేక సమావేశం
- మూడు రోజులపాటు కొనసాగిన ఇన్‌చార్జ్ సమీక్షలు
హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సందడి నెలకొన్నది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు రోజులపాటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించి.. సర్ ప్రక్రియ తీరు.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు. శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వరుసగా మీనాక్షితో భేటీ అయ్యారు. మంత్రులు ఇన్‌చార్జిలుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించారు. ‘సర్’ ప్రక్రియ సాగుతున్న తీరు, పార్టీ పటిష్టతపై డిస్కస్ చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయి.. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇప్పటివరకు మొత్తం 39 మంది డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమీక్షలు పూర్తి చేశారు.
కాగా, మూడు రోజుల రివ్యూ సమావేశాల్లో మంత్రులు వివేక్, వెంకట్‌రెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, సురేఖ, పొన్నం, తుమ్మల, జూపల్లి, అజారుద్దీన్ ప్రత్యక్షంగా హాజరుకాగా.. మంత్రి ఉత్తమ్ ఫోన్ ద్వారా మీనాక్షితో మాట్లాడి నియోజకవర్గ పరిస్థితులను వివరించారు. అలాగే, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కోరం కనకయ్య, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు కలిసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమీక్షల్లో భాగంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలపై మీనాక్షి నటరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు, ‘ఈశ్వరమ్మ వర్సెస్ జక్కిడి’ మధ్య సాగుతున్న పంచాయితీపై ఆరా తీశారు. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని అధికారులకు, స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉండగా.. శనివారం మీనాక్షి తిరిగి మధ్యప్రదేశ్‌కు బయలుదేరనున్నారు.
కేసీఆర్ మాట్లాడితేనే నేను స్పందిస్తా: కోమటిరెడ్డి
మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మంత్రి వెంకట్‌రెడ్డి మీడి యాతో మాట్లా డారు. తెలంగాణలో అసలు ప్రతిపక్ష నాయకుడే లేరని విమర్శించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని, అప్పుడే తాను స్పందిస్తానని స్పష్టం చేశారు. పదేండ్ల పాలనలో ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పా లన్నారు. హరీశ్ రావు లేదా కేటీఆర్ ఎన్ని సభలు పెట్టినా, ఏం మాట్లాడినా తాను స్పందించబోనని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వయసులో కూడా దేశమంతా తిరుగుతూ పార్టీ కోసం కష్టపడుతున్నారని గుర్తుచేశారు. మీనాక్షితో భేటీలో రాష్ట్ర రాజకీయాలు చర్చకు వచ్చాయన్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై..
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మూడు రోజుల సమీక్షల్లో ఆమె దృష్టికి వచ్చిన క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలా వేగవంతం చేయాలనే దానిపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, సీనియర్ నేతలకు తగిన గుర్తింపు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
