- మెయిన్ రోడ్లు, కాలనీల్లోకి చేరిన వరదనీరు
- రూరల్ ప్రాంతాల్లో చిరుజల్లులకు పరిమితం
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో శుక్రవారం దాదాపు మూడు గంటలపాటు కురిసిన వర్షం నగరాన్ని జలమయం చేసింది. ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వానతో ఊరట లభించింది. అయితే, చిన్నపాటి వానకే ప్రధాన రహదారులు, కాలనీలు నీటమునగడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ ప్రాంతానికే పరిమితమవగా, గ్రామీణ ప్రాంతాల్లో మబ్బులు, చిరుజల్లులే కురిశాయి.
గంటపాటు ట్రాఫిక్ ఇబ్బందులు..
ఉదయం నుంచే మబ్బులు కమ్ముకోగా, 8.30 గంటల సమయంలో వర్షం ప్రారంభమైంది. తొలుత చిరుజల్లులు కురిసి, అనంతరం జోరుగా కురవడంతో 11.30 గంటల వరకు వర్షం కొనసాగింది. హనుమకొండలోని అంబేద్కర్ భవన్, అశోకకాలనీ, భవానీనగర్, గోకుల్‌నగర్, వరంగల్ అండర్‌బ్రిడ్జి, బట్టలబజార్, ఎల్లంబజార్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరింది. శివనగర్ అండర్‌బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాలను మళ్లిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. వర్షం ఆగిన గంట తర్వాత వరదనీరు పూర్తిగా తగ్గడంతో పరిస్థితి సాధారణమైంది.
రూరల్‌లో జాడ లేని వాన..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆశించిన వర్షం కురవలేదు. వరి నారు ఎండిపోగా, పత్తి, మొక్కజొన్న పంటలు మొలక దశలోనే వాడిపోతున్నాయి. వర్షాల కోసం రైతులు పూజలు చేస్తున్నప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి సమీపంలోని మండలాల్లో కూడా మబ్బులు మాత్రమే కనిపించగా, వర్షం కురవకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని పలు ఏరియాల్లో శుక్రవారం తెల్లవారు జామున వర్షం కురిసింది. బాన్సువాడ మండలం కొల్లూర్‌లో 56 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 48 మి.మీ, డొంగ్లిలో 35.8 మి.మీ, పిట్లంలో 35 మి.మీ, మహమ్మద్‌నగర్‌లో 27 మి.మీ, బిచ్కుందలో 26.5 మి.మీ, మెనూర్లో 23 మి.మీ, వెల్పుగొండలో 22 మి.మీ, గాంధారిలో 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
