హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌‌‌‌‌‌‌‌కు 20 అకౌంట్లు..ఆదాయం రూ.3 కోట్లు.. అక్రమాస్తులు రూ.100 కోట్లకుపైనే 

హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌‌‌‌‌‌‌‌కు 20 అకౌంట్లు..ఆదాయం రూ.3 కోట్లు.. అక్రమాస్తులు రూ.100 కోట్లకుపైనే 
  •     భార్య, కొడుకు పేరిట ప్రాపర్టీలు 
  •     నలుగురు బినామీల పేరిట పలు కంపెనీల్లో పెట్టుబడులు 
  •     అవినీతి ఆస్తుల లెక్కలు తీస్తున్న ఏసీబీ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:హెచ్‌‌‌‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌‌‌‌ ‌‌‌‌బచ్చు రవీందర్‌‌‌‌(60) ‌‌‌‌ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అక్రమాస్తుల లెక్కలను ఏసీబీ అధికారులు తేల్చుతున్నారు. ఆయన భార్య అర్చన, కుమారుడు తరుణ్‌‌‌‌‌‌‌‌ పేరిట13 ఆస్తులు, రెండు లాకర్లు.. మొత్తం 20 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని గుర్తించారు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి, శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో భార్య అర్చన పేరిట ఎనిమిది, కుమారుడు తరుణ్ పేరిట నాలుగు, మరో నలుగురు బినామీల పేరిట రిజిస్టరైన ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీల తనిఖీతోపాటు లాకర్లను ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ మేరకు రిమాండ్‌‌‌‌ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు.

నానక్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌గూడ సముద్ర అక్రోపొలిస్‌‌‌‌‌‌‌‌ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌లోని రవీందర్ నివాసంతో పాటు శంషాబాద్‌‌‌‌‌‌‌‌, మసీద్ బండ సహా మొత్తం10 ప్రాంతాల్లో మంగళవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ. 3.82 లక్షలు నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి సహా మొత్తం రూ.9.24 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 

అక్రమార్జన రూ.100 కోట్లకుపైనే..  

రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి జీతం, ఖర్చులు సహా మిగులుకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. 1985 మే 24న ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఈ నెల14 వ తేదీ నాటికి  మొత్తం సంపాదన రూ.3 కోట్లుగా లెక్కలు తేల్చారు. ఇందులో రూ.1.5 కోట్లు ఖర్చులు పోను రూ. 1.5 కోట్లు మాత్రమే సేవింగ్స్ ఉండాలి. కానీ, సోదాల సమయంలో రూ.11.86 కోట్లు విలువ చేస్తే ఆస్తులు బయటపడ్డాయి. ఈ లెక్కన రవీందర్ ఆదాయానికి మించి రూ.10.36 కోట్లు అదనంగా కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది.

దీంతో పాటు రవీందర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఆయన భార్య అర్చన, కుమారుడు తరుణ్ పేరిట కూడబెట్టిన ఆస్తులతో పాటు బినామీల పేరిట రిజిస్టర్ చేసిన స్థిరాస్తులను గుర్తించారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పది రెట్లు ఎక్కువగా అంటే.. రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు. పలు కంపెనీలతో లింకైన బ్యాంక్ అకౌంట్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా సేకరిస్తున్నారు. కంపెనీల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 


ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, ఫ్లైఓవర్ల టెండర్లలో భారీ అవినీతి 

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సహా ఔటర్ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, పీవీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ హైవే నిర్మాణంతో పాటు సిటీలోని ఫ్లై ఓవర్ల నిర్మాణాల్లో రవీందర్ కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు సేకరించింది. ఇటీవల ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్ల వ్యవహారంలోనే రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలతో కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కింది స్థాయి సిబ్బందితోపాటు ఆయా డివిజన్లకు చెందిన ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ విభాగాల అధికారులతో కలిసి పెద్ద మొత్తంలో వసూళ్ల పర్వం నడిపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పలు ఫైళ్ల క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇటీవలి కాలంలో ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఆయన కుటుంబసభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల తనిఖీ, లాకర్లు ఓపెన్ చేసిన అనంతరం మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.