ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు కీలకమైన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026 జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్స్ ముఖ్యంగా 10 ఏళ్ల అర్హత సర్వీస్ పూర్తి చేయకముందే ఉద్యోగం వదిలే EPF సభ్యుల కోసం కీలక మార్పులు తీసుకొచ్చారు. నెలవారీ పెన్షన్ పొందేందుకు అవసరమైన కనీస 10 సంవత్సరాల సేవా నిబంధనలో ఎలాంటి మార్పు చేయకపోయినా.. పెన్షన్ విత్‌డ్రాయల్ బెనిఫిట్‌కు సంబంధించిన రూల్స్ సవరించారు. దీంతో ఉద్యోగులు తమ భవిష్యత్ పెన్షన్ ప్లాన్ మరింత జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
10 ఏళ్లు పూర్తి కాకపోతే రెండు ఆప్షన్లు..
EPS 2026 ప్రకారం10 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందే ఉద్యోగం వదిలి, ఇంకా సూపర్‌అన్యుయేషన్ వయస్సుకు చేరుకోని సభ్యులకు రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది Withdrawal Benefit పొందడం. రెండోది Scheme Certificate తీసుకోవడం. స్కీమ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇప్పటివరకు చేసిన సర్వీసును ఉద్యోగి భద్రపరుచుకోవచ్చు. భవిష్యత్తులో మరో EPF పరిధిలోని కంపెనీలో ఉద్యోగంలో చేరితే.. పాత సేవా కాలాన్ని కొత్త ఉద్యోగంలోని సర్వీసుతో కలిపి లెక్కిస్తారు. తరచుగా జాబ్ మారే ఉద్యోగులకు ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతుంది.
విత్‌డ్రాయల్‌పై కొత్త వెయిటింగ్ పీరియడ్..
EPS 2026లో వచ్చిన అతిపెద్ద మార్పు Withdrawal Benefit విషయంలోనే కనిపిస్తోంది. గతంలో ఉద్యోగం వదిలిన వెంటనే అర్హత ఉంటే విత్‌డ్రాయల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగం మానేసిన తర్వాత వెంటనే డబ్బులు తీసుకోలేరు. చివరిసారి EPF కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన తేదీ నుంచి 36 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే Withdrawal Benefit క్లెయిమ్ చేయడానికి అర్హత ఉంటుంది. లేదంటే సూపర్‌అన్యుయేషన్ వయస్సుకు చేరుకుంటే అప్పుడే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అదే వర్తిస్తుంది.
విత్‌డ్రాయల్ మొత్తం ఎలా లెక్కిస్తారు?
కొత్త రూల్స్ ప్రకారం విత్‌డ్రాయల్ బెనిఫిట్ మొత్తాన్ని పెన్షనబుల్ శాలరీ, అలాగే పూర్తి చేసిన సర్వీస్ కాలాన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. స్కీమ్‌లోని షెడ్యూల్-IIలో ప్రతి సేవా కాలానికి ప్రత్యేక ఫ్యాక్టర్‌ను నిర్ణయించారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 36 నెలల సర్వీస్ పూర్తి చేసి, ఉద్యోగం వదిలే సమయానికి అతని పెన్షన్ జీతం రూ.15వేలు ఉంటే.. ఆ మొత్తాన్ని షెడ్యూల్-IIలో పేర్కొన్న సంబంధిత ఫ్యాక్టర్‌తో గుణించి చెల్లించాల్సిన విత్ డ్రా బెనిఫిట్స్ నిర్ణయిస్తారు.
ALSO READ : E20 పెట్రోల్ వివాదం: గ్రాండ్ విటారా కేసులో మారుతి కీలక నిర్ణయం..
ఉద్యోగులకు ఏది మంచిది?
భవిష్యత్తులో మళ్లీ EPF పరిధిలోని సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటే Scheme Certificate తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాత సర్వీస్ వృథా కాకుండా భద్రంగా ఉంటుంది. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత నెలవారీ పెన్షన్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇక మళ్లీ EPF ఉద్యోగంలో చేరే ఉద్దేశం లేకపోతే Withdrawal Benefit ఎంచుకోవచ్చు. అయితే కొత్త EPS 2026 నిబంధనల ప్రకారం మూడేళ్ల వెయిటింగ్ పీరియడ్‌ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
