ఉద్యోగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నం: భట్టి విక్రమార్క

ఉద్యోగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నం:  భట్టి విక్రమార్క
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: డిప్యూటీ సీఎం భట్టి 
  • సెక్రటేరియెట్‌‌లో ‘న్యూ ఎంప్లాయీస్  హెల్త్ స్కీమ్’ ప్రారంభం
  • 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌‌లెస్ వైద్యం
  • సీజీహెచ్ఎస్ ప్యాకేజీ కింద 1,816 రకాల చికిత్సలకు అవకాశం
  • గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ. 10 వేల కోట్ల బకాయిలు 
  • చెల్లిస్తున్నామని వెల్లడి ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో 
  • ఉచిత వైద్యం: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సంక్షేమానికి  రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులే నిజమైన వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఉచిత విద్యుత్, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌లాంటి ఇందిరమ్మ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరి వద్దకు చేర్చడంలో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో పని చేయాలని కోరారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ను భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ హెల్త్ స్కీమే నిదర్శనమని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం  ప్రభుత్వం ఇంతగా కృషి చేస్తున్న తరుణంలో..ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరి వద్దకు చేర్చడంలో ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని కోరారు.


ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్ నెట్‌‌‌‌వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత ఇన్‌‌‌‌పేషెంట్ వైద్య సేవలు పొందవచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ప్యాకేజీ రేట్లకు తగ్గట్టుగా 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలను ఈ పథకం ద్వారా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వినూత్న పథకం అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు వీలుగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమాన భాగస్వామ్యం కల్పిస్తూ ఒక ప్రత్యేక ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచి, అర్హులైన 1.06 కోట్ల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. 

గత ప్రభుత్వం రూ. పదివేల కోట్ల బకాయిలు పెట్టింది 

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. హాస్పిటల్ పాలై, అప్పుల్లో కూరుకుపోయిన ఉద్యోగి కళ్లల్లో ఆందోళన ఉంటే ప్రభుత్వానికి సరైన పనితీరును అందించలేడని, అందుకే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాదాపు రూ. 10 వేల కోట్ల బిల్లులను  మానవీయ కోణంలో ఆలోచించి  తమ ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. ఈ పెండింగ్ బకాయిలను నెలకు రూ. 2 వేల కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామని, ప్రతి 15 రోజులకోసారి తానే స్వయంగా సమీక్షిస్తూ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా చూస్తున్నానని  వివరించారు. 
ఉద్యోగుల యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే సదుద్దేశంతో సీఎం ఒక కేబినెట్‌‌‌‌ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో తాను ఈ సబ్ కమిటీకి చైర్మన్‌‌‌‌గా వ్యవహరించగా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై తామంతా సుదీర్ఘంగా చర్చించి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యాధునిక వైద్య సేవలు: మంత్రి దామోదర

కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌‌‌‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు అత్యాధునిక వైద్య సేవలు పొందేలా ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (ఎన్ఈహెచ్ఎస్) ను తీసుకువచ్చామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ స్కీమ్ అమల్లో ఉద్యోగులు, పెన్షనర్ల కంట్రిబ్యూషన్‌‌‌‌కు సమానంగా ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేస్తుందని.. ప్రతి పైసాను ఈహెచ్‌‌‌‌ఎస్ అమలు కోసమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌తోపాటు 114 ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లో క్యాష్‌‌‌‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పథకంలో భాగస్వామ్యమైన అన్ని హాస్పిటళ్ల యాజమాన్యాలు, డాక్టర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పాత విధానంలో ప్యాకేజీ ధరలు తక్కువగా ఉండటం వల్ల పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ముందుకు రాలేదని, క్లెయిమ్‌‌‌‌ల చెల్లింపులో తీవ్ర ఆలస్యం జరిగేదని మంత్రి గుర్తుచేశారు. వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతూ పూర్తి పారదర్శకంగా ఈ కొత్త స్కీమ్‌‌‌‌ను తెచ్చినట్టు వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం వెల్‌‌‌‌నెస్ సెంటర్లు లేని 24 జిల్లాల్లో కొత్తగా మరో 24 వెల్‌‌‌‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (జీఏడీ) బెన్‌‌‌‌హర్ మహేశ్‌‌‌‌ దత్ ఎక్కా, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.