మన దగ్గర కొవిడ్ అప్రమత్తతేది.?బోర్డర్‌‌‌‌‌‌‌‌లో నిఘా పెంచిన ఒడిశా.. మన దగ్గర మాత్రం నో అలెర్ట్!

మన దగ్గర కొవిడ్ అప్రమత్తతేది.?బోర్డర్‌‌‌‌‌‌‌‌లో నిఘా పెంచిన ఒడిశా.. మన దగ్గర మాత్రం నో అలెర్ట్!
  • పొరుగు రాష్ట్రం ఏపీలో 20 రోజుల్లోనే 12 కొవిడ్ కేసులు, నలుగురు మృతి
  •     మంగళగిరి ఎయిమ్స్, విజయవాడ జీజీహెచ్‌‌‌‌‌‌‌‌లో  ప్రత్యేక వార్డులు
  •     బోర్డర్‌‌‌‌‌‌‌‌లో నిఘా పెంచిన ఒడిశా.. మన దగ్గర మాత్రం నో అలెర్ట్!

హైదరాబాద్, వెలుగు: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేవలం 20 రోజుల్లోనే  12 కొవిడ్ కేసులు నమోదు కావడం, నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఈ పరిణామాలతో ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాలు కూడా బోర్డర్​లో నిఘాను పెంచాయి. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సీజనల్ జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు జోరందుకుంటున్నా వైద్యారోగ్య శాఖ ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీలో నలుగురు మృతి...

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో జూన్ 26 నుంచి జులై 16 వరకు మొత్తం 12 కొవిడ్ కేసులు నమోదు కాగా, నలుగురు చనిపోయారు. మృతులు కిడ్నీ వ్యాధులు, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించేందుకు ఐదు నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. విజయవాడ జీజీహెచ్ లో 15 బెడ్లతో ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్‌‌‌‌‌‌‌‌లలో ఫీవర్ వార్డులను అందుబాటులోకి తెచ్చారు.

 తెలంగాణలో నో అలెర్ట్..

పక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా తెలంగాణ వైద్యారోగ్య శాఖ కనీస అప్రమత్తత చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో వైరల్ జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులతో హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. బస్తీ దవాఖానలకు వస్తున్న రోగులకు కేవలం సాధారణ జ్వరం మందులు మాత్రమే ఇస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల లాంటి సరిహద్దు జిల్లాల్లో కనీస నిఘా పెట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతుయి. 

దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా సుమారు 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో అత్యధికంగా 115 కేసులు, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు వెలుగుచూశాయి. జ్వరం, పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, రద్దీ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.