- 20వ రోజుకు దీక్ష.. క్షీణిస్తున్న ఆరోగ్యం
- ఖేరా పరామర్శ, దీక్ష విరమించాలని విజ్ఞప్తి
- నిరసనల గొంతు వినడం రాజధర్మమని హితవు
- మద్దతు తెలిపిన ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే
న్యూఢిల్లీ: పార్లమెంట్ మార్చ్ లో పాల్గొనేందుకైనా ఈ నెల 20 వరకు ప్రాణాలతో ఉంటానని పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ సహా పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నాటికి దీక్ష చేపట్టి 20 రోజులు గడవడంతో వాంగ్ చుక్ తీవ్రంగా నీరసించారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష విరమించాలంటూ వివిధ వర్గాల నుంచి వాంగ్‌చుక్ కు విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై వాంగ్ చుక్ శుక్రవారం స్పందించారు. ‘‘ఈ జులై 20 మార్చ్‌లో మీ అందరితో కలిసి నేను కూడా నడవడానికి ఎలాగైనా సరే ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ ఆ రోజు మన పార్లమెంట్ మార్చ్ సక్సెస్ కాకపోతే... నేను కచ్చితంగా దయ్యంగానైనా తిరిగి వస్తా” అని పేర్కొన్నారు. తాను బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల చాలా బలంగా ఉన్నానని చెప్పారు. ‘‘మీరంతా కూడా మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నారని నాకు తెలుసు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో మన ఆవేదనను వినిపించడానికి ఈ శక్తి జులై 20న అవసరం’’ అని ఆయన పిలుపునిచ్చారు.
వాంగ్‌చుక్ శిబిరానికి పవన్ ఖేరా
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కు అని, దీక్షలు చేస్తున్న ప్రజల గొంతుకను వినడం ఏ ప్రభుత్వానికైనా ‘రాజధర్మం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. గతంలో 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, 2011లో యూపీఏ హయాంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తమతో విభేదించిన నిరసనకారులతో సైతం చర్చలు జరిపారని గుర్తుచేశారు. శుక్రవారం జంతర్ మంతర్‌లోని వాంగ్‌చుక్ దీక్షా శిబిరాన్ని ఖేరా సందర్శించారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం కలిశారు. క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమించాలని ఆమె వాంగ్‌చుక్‌ను కోరారు. పార్లమెంటరీ సమావేశాల్లో, నీట్ విద్యార్థుల సమస్యలతో సహా అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తాము పోరాడుతామని ఆమె హామీ ఇచ్చారు.
ఎన్డీయే సర్కారుపై ఖేరా ఫైర్..
నిరసనకారులపట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తీవ్రమైన ఉదాసీనత ప్రదర్శిస్తోందని పవన్ ఖేరా విమర్శించారు. ‘‘ప్రభుత్వ అలసత్వం అహంకారపూరితం మాత్రమే కాదు అత్యంత క్రూరమైనది, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం తగనిది” అని ఫైర్ అయ్యారు. ‘‘ప్రజాస్వామ్య నిరసనల భాష అర్థం చేసుకోని, సున్నితత్వం లేని ప్రభుత్వంతో మనం వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వంతో పోరాడేటప్పుడు నిరసన పద్ధతులు మారాలి.
ఈ ప్రభుత్వం ముందు ప్రాణాలను పణంగా పెట్టడం వల్ల ఫలితం ఉండదు” అని వ్యాఖ్యానించారు.
