న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళితత్వ సూత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ జూనియర్ అడ్వొకేట్స్ అసోసియేషన్ (టీజేఏఏ), ఎఫ్ఓఎల్‌పీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవా రం ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్‌ను టీజేఏఏ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది.
హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళా వర్గాలకు చెందిన అర్హత, ప్రతిభ కలిగిన అభ్యర్థులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, స్థానిక ప్రజల ఆకాంక్షలు, హక్కులు, అవకాశాల గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్టు ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
రాజ్యాంగబద్ధమైన విధానంలో తెలంగాణకు చెందిన అర్హులైన న్యాయవాదులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం పేర్కొంది.
