న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై వరుస వైఫల్యాల నేపథ్యంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వన్డే క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాలో విభేదాల సెగ మొదలైంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం రోహిత్ వర్సెస్ గంభీర్, అగార్కర్ అన్నట్లుగా మారిపోయినట్లు తెలుస్తోంది.
దాదాపు 513 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 50 సెంచరీలతో 20 వేలకు పైగా రన్స్ చేశాడు. కాబట్టి రిటైర్మెంట్ నిర్ణయాన్ని స్వయంగా తీసుకునే హక్కు అతనికి ఉంది. కానీ అదే టైమ్‌లో మరో 15 నెలలలో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో అత్యుత్తమ జట్టును బరిలోకి దించే హక్కు కూడా సెలెక్టర్లకు ఉంటుంది. ఇక లార్డ్స్ వేదికగా రేపు జరిగే మ్యాచ్ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనుంది. సరిగ్గా అదే సమయంలో ఆసియా క్రీడల టీ20 మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. ఒకవేళ వన్డేల్లో కొనసాగాలని రోహిత్ పట్టుబడితే సెలెక్షన్ కమిటీ ఎలా స్పందిస్తుందన్నదే ఉత్కంఠగా మారింది.
ముగ్గురు మొండిఘటాలే..
రోహిత్, గంభీర్, అజిత్ అగార్కర్.. ఈ ముగ్గురి మధ్య పరస్పర నమ్మకం లోపించినట్లు స్పష్టమవుతోంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ఈ ముగ్గురి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. గతంలో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు, ఆయన రోహిత్, -అగార్కర్ మధ్య ఒక వారధిలా వ్యవహరించాడు. ఆ సమన్వయం వల్లే ఇండియా 2023 వన్డే వరల్డ్ కప్ రన్నరప్‌గా, 2024 టీ20 వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచింది. కానీ గంభీర్ శైలి ద్రవిడ్‌కు పూర్తిగా భిన్నం. తన నమ్మకాలకు కట్టుబడి ఉండే గంభీర్ రాకతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
2005 నాటి సీన్ రిపీట్..?
ప్రస్తుత రోహిత్, -గంభీర్ వివాదం.. 2005 నాటి సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ వివాదాన్ని తలపిస్తోంది. 2024 ఐపీఎల్ సమయంలో వాంఖడే స్టేడియంలో కోల్‌కతా, ముంబై మ్యాచ్ సందర్భంగా ఆసక్తికరమైన ఘటనే జరిగింది. ద్రవిడ్ త్వరలో తప్పుకోనుండటంతో గంభీర్ రేసులో ముందున్నాడు. ఆ రోజు ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ స్వయంగా గంభీర్ దగ్గరకు వెళ్లి ‘గౌతీ భాయ్, టీమిండియాలోకి వచ్చేయండి’ అని కోరినట్లు సమాచారం. దానికి గంభీర్ స్పందిస్తూ.. ‘నువ్వు కెప్టెన్‌గా ఉంటే కచ్చితంగా వస్తా’ అని అన్నారట.
అయితే, ద్రవిడ్ మేనేజ్‌మెంట్ శైలికి అలవాటు పడిన రోహిత్‌కు.. గంభీర్‌తో పనిచేయడం అంత సులువు కాదని అప్పట్లోనే కొందరు హెచ్చరించారు. ఆ ఆందోళనలు నిజమేనని నిరూపిస్తూ, న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో ఇండియా 0–-3తో ఓడినప్పటి నుంచే విభేదాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటన సమయానికి ఇరుపక్షాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఏం జరిగింది..?
జనవరి 2న సిడ్నీ టెస్ట్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్, గంభీర్, అగార్కర్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఫామ్ లేమితో బాధపడుతున్న రోహిత్ ఆ మ్యాచ్‌కు దూరం కావాలని భావించాడు. అయితే, ఆరు నెలల తర్వాత జరిగే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావాలంటే ఈ మ్యాచ్ ఆడాల్సిందేనని అగార్కర్ సూచించాడు. ఆ సమయంలో రోహిత్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నా.. ఆ తర్వాత మీడియా ముఖంగా ‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకేది మంచిదో నాకు తెలుసు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ పరిణామంతో గంభీర్, అగార్కర్ షాక్‌కు గురయ్యారు. దీంతో వారి మధ్య నమ్మకం మరింత సన్నగిల్లింది.
కెప్టెన్సీ మార్పుతో ముగిసిన బంధం
చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే, తదుపరి సిరీస్‌లో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం అతన్ని తీవ్రంగా కలచివేసింది. ఐపీఎల్ తర్వాత ఇండియా వన్డేలు ఆడకపోవడం వల్ల రోహిత్‌కు ఫామ్ నిరూపించుకునే అవకాశం రాలేదు. 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగార్కర్ చెప్పడంతో రోహిత్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ విషయంలో గంభీర్, అగార్కర్ ఇద్దరూ ఒకే మాటపై నిలిచారు.
ఆ తర్వాత రోహిత్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ గందరగోళం అతను బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది, ఫలితంగా పరుగులు కూడా తగ్గాయి. ఒక పేలవమైన ఇన్నింగ్స్ ఆడిన రోజే రోహిత్‌ను పక్కన పెట్టాలనే వార్తలు రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. మొత్తానికి రోహిత్, గంభీర్, అగార్కర్ ఎపిసోడ్ మున్ముందు మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
