Anasuya Bharadwaj: సోనమ్ వాంగ్‌చుక్ కోసం గళం విప్పిన అనసూయ.. పీఎంవో, హోంమంత్రికి సూటి ప్రశ్నలు

Anasuya Bharadwaj: సోనమ్ వాంగ్‌చుక్ కోసం గళం విప్పిన అనసూయ.. పీఎంవో, హోంమంత్రికి సూటి ప్రశ్నలు

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సామాజిక అంశంపై స్పందించారు. లడఖ్ హక్కుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు ఆమె బహిరంగంగా మద్దతు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం (PMO), కేంద్ర హోంమంత్రిని సూటిగా ప్రశ్నించారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఉద్యమానికి మద్దతుగా నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ఇది గౌరవపూర్వక విజ్ఞప్తి.. శాంతియుత ప్రశ్న.. జవాబుదారీతనం కోసం ఓ ఆశ’ అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మన ప్రజాస్వామ్యం కోసం.. మన రాజ్యాంగం కోసం.. ప్రతి భారతీయుడి కోసం’ అని పేర్కొంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ‘‘శాంతియుతంగా ప్రజలు తమ సమస్యలను చెబుతున్నప్పుడు నిశ్శబ్దం ఎందుకు? ప్రజాస్వామ్యంలో చర్చలే ముందుండాలి’’ అని అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు. ఒక తల్లిగా పిల్లలకు మెరిట్, నిజాయితీ, జవాబుదారీతనం ఉన్న విద్యావ్యవస్థ అవసరమని, సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న దీక్ష ఆ దిశగా ఆలోచింపజేస్తోందని తెలిపారు.

అలాగే, ప్రజలు శాంతియుతంగా సమాధానాలు కోరినప్పుడు వారికి స్పందించే బాధ్యత పాలకులదేనని, ప్రశ్నలను స్వాగతించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం పౌరులకు ప్రశ్నించే హక్కు ఇచ్చిందని, అదే సమయంలో ప్రజల మాట వినే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్షిణించిన సోనమ్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

లడఖ్ హక్కుల కోసం జంతర్‌మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఇవాళ శనివారం జులై 18న ఉదయం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేశారంటూ, గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.

వాంగ్‌చుక్‌కు సినీ ప్రముఖుల మద్దతు

జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా నిర్వహించనున్న ‘చలో సంసద్’ మార్చ్‌కు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ఇప్పటికే నటులు ప్రకాశ్ రాజ్, అభయ్ డియోల్, అనురాగ్ కశ్యప్, సోనాక్షి సిన్హా, సయాజీ షిండే తదితర సినీ ప్రముఖులు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.