దేశంలోనే తొలిసారి.. హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ ఛాంపియన్షిప్.. విశేషాలు ఇవే !

దేశంలోనే తొలిసారి.. హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ ఛాంపియన్షిప్.. విశేషాలు ఇవే !

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వేదికగా సెయిలింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించారు.  1వ ఐఎల్‌సీఏ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ తో పాటు వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్–2026 శనివారం (జులై 18) ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమం ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ (EMESA)లో నిర్వహించగా, ఎంసీఎంఈ కమాండెంట్, ఈఎంఈ కార్ప్స్ కల్నల్ కమాండెంట్, ఈమెసా కమోడోర్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా నీరజ్ వర్ష్నే మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ వేదికగా దేశంలోనే తొలి అంతర్జాతీయ ఐఎల్‌సీఏ ఓపెన్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఈమెసా భారత సెయిలింగ్ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ ఒలింపియన్లు, అర్జున అవార్డు గ్రహీతలు సహా అనేక మంది ప్రతిభావంతులైన సెయిలర్లను తీర్చిదిద్దిందని తెలిపారు.

సెయిలింగ్ క్రీడ క్రమశిక్షణ, సహనం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విజయం కంటే పోటీ స్ఫూర్తి, పట్టుదలే గొప్పవని, భవిష్యత్తులో ఈ టోర్నీకి మరింత అంతర్జాతీయ గుర్తింపు, విదేశీ పాల్గొనేవారి సంఖ్య పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సముద్రాలను దాటాలంటే ఒడ్డును విడిచి ముందుకు సాగాలి  అనే క్రిస్టోఫర్ కొలంబస్ సూక్తిని ఉటంకిస్తూ, కొత్త లక్ష్యాలను ధైర్యంగా చేరుకోవాలని యువ సెయిలర్లకు పిలుపునిచ్చారు.

ఎంసీఎంఈ ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ ఐఎల్‌సీఏ (ILCA), యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (YAI) సహకారంతో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 124 మంది సెయిలర్లు పాల్గొన్నారు. వీరిలో 19 మంది మహిళలు, బాలికలు ఉన్నారు. ఆర్మీ, నేవీ, సివిలియన్ సెయిలింగ్ సంస్థలకు చెందిన 19 క్లబ్‌లు, సంస్థలతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా పోటీల్లో పాల్గొన్నారు.

ILCA-7, ILCA-6 (పురుషులు, మహిళలు), ILCA-4 (బాలురు, బాలికలు) విభాగాల్లో జరిగిన ఈ పోటీలు విజయవంతంగా ముగియడంతో, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల నిర్వహణకు హైదరాబాద్, ఈమెసా మరోసారి ప్రముఖ వేదికగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు.