రూ.65 కోట్ల టాక్స్ రీఫండ్ స్కామ్ బట్టబయలు.. మీరట్ స్లమ్ గర్ల్

రూ.65 కోట్ల టాక్స్ రీఫండ్ స్కామ్ బట్టబయలు.. మీరట్ స్లమ్ గర్ల్

దేశవ్యాప్తంగా వేలాది మంది పేర్లతో ఫేక్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి రూ.65 కోట్లకు పైగా టాక్స్ రీఫండ్‌లు పొందిన భారీ స్కామ్‌ను ఆదాయపు పన్ను శాఖ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ స్కామ్ వెనుక ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 30 ఏళ్ల నాన్సీ అగర్వాల్ అనే యువతి కీలక సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేవలం 25 చదరపు గజాల ఇంట్లో ఫ్యామిలీతో కలిసి నివసిస్తూ.. దేశవ్యాప్తంగా 3వేల మందికిపైగా వ్యక్తుల ద్వారా ఈ భారీ మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

చట్టంలోని లూప్ హోల్స్ వాడుకుని..
చిన్న అకౌంటింగ్ సంస్థలో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకున్న నాన్సీ.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80GGCలో ఉన్న నిబంధనను తన మోసానికి ఆయుధంగా మార్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే పన్ను మినహాయింపు పొందే అవకాశాన్ని ఆసరాగా తీసుకుని, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇచ్చినట్లు నకిలీ వివరాలు నమోదు చేసేది. ఈ తప్పుడు సమాచారంతో వేలాది మంది తరఫున ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, అర్హత లేకపోయినా భారీ టాక్స్ రీఫండ్‌లు పొందేలా చేసింది. మొత్తం రూ.357 కోట్ల విలువైన తప్పుడు డిడక్షన్లు, మినహాయింపులు చూపించి ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

రిఫరల్ స్కీమ్‌తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్..
నాన్సీ తన అక్రమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రత్యేక రిఫరల్ విధానాన్ని అమలు చేసింది. ఇప్పటికే తన వద్ద సేవలు పొందిన క్లయింట్లు కొత్త వారిని తీసుకొస్తే వారికి ఫీజులో రాయితీలు ఇచ్చేది. ముఖ్యంగా శాలరీడ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ.. "భారీ టాక్స్ రీఫండ్ తెప్పిస్తాం" అని నమ్మించి తప్పుడు క్లెయిమ్‌లతో ఐటీఆర్‌లు దాఖలు చేసేది. కొందరు ఈ మోసంలో తెలిసే పాల్గొనగా, మరికొందరు పూర్తి వివరాలు తెలియకుండానే ఇందులో చిక్కుకున్నట్లు ఆదాయపు పన్ను అధికారులు భావిస్తున్నారు.

ఈ భారీ స్కామ్‌పై అనుమానం వచ్చిన అనంతరం మీరట్ ఇన్‌కమ్ టాక్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సమన్వయంతో పలుచోట్ల దాడులు నిర్వహించింది. నాన్సీకి సంబంధించిన నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేసి, రెండు బ్యాంక్ లాకర్లను తెరిచారు. ఈ దాడుల్లో రూ.5 లక్షల నగదు, సుమారు రూ.4 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేలాది మంది క్లయింట్ల వివరాలు ఉన్న చేతిరాత రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాన్సీపై క్రిమినల్ చర్యలు ప్రారంభించిన ఐటీ శాఖ, అక్రమ రీఫండ్‌లు పొందిన పన్ను చెల్లింపుదారులకు కూడా నోటీసులు జారీ చేసి డబ్బు తిరిగి వసూలు చేసే ప్రక్రియను ప్రారంభించింది.