దేశంలో E20 పెట్రోల్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వాహన యజమానుల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా LocalCircles నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. E20 పెట్రోల్ కారణంగా తమ వాహనానికి పెద్ద నష్టం జరిగిందని భావిస్తే 45 శాతం మంది చట్టపరమైన పోరాటానికి సిద్ధమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 316 జిల్లాలకు చెందిన 22వేల 373 మంది పెట్రోల్ వాహన యజమానుల అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వే.. E20పై వినియోగదారులలో ఉన్న అనుమానాలను స్పష్టంగా బయటపెట్టింది.
45% మంది లీగల్ ఫైట్‌కు రెడీ..
సర్వే ప్రకారం 31 శాతం మంది నేరుగా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తామన్నారు. మరో 14 శాతం మంది అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని చెప్పారు. మొత్తంగా 45 శాతం మంది కోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. మరో 18 శాతం మంది వాహన తయారీ సంస్థతో పాటు ఇంధన కంపెనీ నుంచి కూడా నష్టపరిహారం కోరుతామని చెప్పగా.. 9 శాతం మంది కేవలం వాహన తయారీ సంస్థనే బాధ్యులను చేస్తామని చెప్పారు. ఈ ఫలితాలు E20పై వినియోగదారుల్లో పెరుగుతున్న అసంతృప్తిని బయటపెట్టింది.
పాత వాహనాల యజమానుల్లో ఎక్కువ ఆందోళన..
2023కు ముందు కొనుగోలు చేసిన పెట్రోల్ వాహనాల యజమానుల్లో 55 శాతం మంది.. 2025 ప్రారంభం నుంచి తమ వాహనాల్లో రిపేర్స్ భారీగా పెరిగాయని, విడిభాగాల అరిగిపోవడం ఎక్కువైందని చెప్పారు. గతంలో నిర్వహించిన మరో సర్వేలో 66 శాతం మంది వాహన యజమానులు E20 వినియోగం తర్వాత మైలేజ్ 10 శాతం కంటే ఎక్కువ తగ్గిందని పేర్కొన్నట్లు LocalCircles గుర్తుచేసింది. సో కొత్త రకం పెట్రోల్ పాత వాహనాలకు శాపంగా మారుతోందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
రాయ్‌పూర్ కోర్టు తీర్పుతో ధైర్యం..
ఈ సర్వేకు ముందు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. E20 పెట్రోల్ వాడిన తర్వాత ఇంజిన్ సమస్యలు, పనితీరు తగ్గడం, మైలేజ్ పడిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయని ఫిర్యాదు చేసిన ఓ కారు యజమానికి అనుకూలంగా కమిషన్ తీర్పు ఇచ్చింది. వాహనాన్ని మార్చాలని లేదా రూ.20.5 లక్షలు తిరిగి చెల్లించాలని, అదనంగా రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పరిణామం తర్వాత E20 వల్ల నష్టం జరిగితే చట్టపరంగా న్యాయం పొందవచ్చనే నమ్మకం వాహన యజమానుల్లో పెరిగిందని సర్వే సూచిస్తోంది. అలాగే పాతవాహనాలకు అనకూలమైన E0, E5 లేదా E10 పెట్రోల్స్ కూడా అమ్మాలని ఓనర్స్ కోరుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
