మెస్సీ కథకు స్పెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్.. ఇంతకీ కప్ ఎవరిది?

మెస్సీ కథకు స్పెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్.. ఇంతకీ కప్ ఎవరిది?

FIFA World Cup 2026 Final: ఫుట్‌బాల్ ప్రపంచంలో లెజెండ్‌గా ఎదిగిన లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన ప్రపంచకప్ కెరీర్‌కు ఒక మరుపురాని ముగింపు ఇవ్వడానికి కేవలం ఒకే ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. 2022లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన మెస్సీ, రేపు (ఆదివారం) జరగబోయే ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో సరికొత్త హిస్టరీపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే, ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న మూడో జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.

మెస్సీ ముంగిట అరుదైన కెప్టెన్సీ రికార్డు: 
ఈ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా జట్టుకే కాకుండా పర్సనల్‌గా లియోనెల్ మెస్సీకి ఎంతో ప్రతిష్టాత్మకం. ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే.. ఫుట్‌బాల్ చరిత్రలో ముందెన్నడూ ఏ ఆటగాడు సాధించని విధంగా.. రెండుసార్లు కెప్టెన్‌గా ప్రపంచకప్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్‌‌ గా మెస్సీ చరిత్ర పుటల్లోకెక్కుతాడు. అంతేకాదు, ఈ విజయంతో అర్జెంటీనా మొత్తం 4 ప్రపంచకప్‌లతో జర్మనీ, ఇటలీల సరసన నిలుస్తుంది. ప్రస్తుత టోర్నీలో మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ ఏకంగా 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో జట్టును ముందుండి నడిపించాడు.

ఇంగ్లాండ్‌పై మెస్సీ సృష్టించిన 7 నిమిషాల మ్యాజిక్: 
సెమీఫైనల్లో థామస్ టూఖెల్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 85వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ గెలుపు ఖాయమనుకున్న తరుణంలో మెస్సీ తన అద్భుతమైన ప్రతిభతో కేవలం 7 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించేలా చేసి ఫైనల్ టికెట్ ఖరారు చేశాడు. ప్రపంచకప్ వేదికపై మెస్సీని తక్కువ అంచనా వేయడం ఎంత ప్రమాదకరమో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. స్పెయిన్ జట్టు కూడా ఇలాంటి మ్యాజిక్‌ను దృష్టిలో ఉంచుకునే బరిలోకి దిగాల్సి ఉంటుంది.

మెస్సీ ఫెయిరీ టేల్ ముగింపునకు అడ్డుగా స్పెయిన్: 
మెస్సీ చారిత్రాత్మక రికార్డుకు, అర్జెంటీనా కలలకు మధ్య ఇప్పుడు పటిష్టమైన స్పెయిన్ జట్టు పెద్ద సవాల్‌గా నిలిచింది. లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలోని స్పెయిన్, ఈ టోర్నమెంట్‌లో అత్యంత సమతుల్యమైన (Balanced) జట్టుగా పేరు తెచ్చుకుంది. కేప్ వెర్డేతో జరిగిన మొదటి మ్యాచ్ డ్రా అయినప్పటికీ, ఆ తర్వాత వారు అజేయంగా దూసుకువచ్చారు. ఫైనల్ చేరే క్రమంలో బెల్జియంపై మాత్రమే స్పెయిన్ ఒక గోల్ సమర్పించుకుంది. 

మెస్సీని కట్టడి చేయడమే స్పెయిన్ టాస్క్: 
రోడ్రి (Rodri) నేతృత్వంలోని క్రమశిక్షణతో కూడిన మిడ్‌ఫీల్డ్ సాయంతో స్పెయిన్ మ్యాచ్‌లను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంటోంది. ఫైనల్లో స్పెయిన్ ముందున్న అతిపెద్ద టాస్క్ మెస్సీని కట్టడి చేయడమే.. మెస్సీకి బంతి దొరికిన ప్రతిసారీ అతనిపై ఒత్తిడి తెచ్చి, అవకాశాలు సృష్టించకుండా అడ్డుకోవడమే స్పెయిన్ ప్రధాన వ్యూహం. స్పెయిన్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి రెండో ప్రపంచకప్ కల చెదిరిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ మహా సమరంలో మెస్సీ జట్టు విజేతగా నిలుస్తుందో లేదో అంటే రేపటి వరకు ఆగాల్సిందే.