నేను ఇంగ్లాండ్ కోచ్గా వెళ్లను.. ఆర్‌సీబీతోనే నా ప్రయాణం: ఆండీ ఫ్లవర్

నేను ఇంగ్లాండ్ కోచ్గా వెళ్లను.. ఆర్‌సీబీతోనే నా ప్రయాణం: ఆండీ ఫ్లవర్

Andy Flower: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు టెస్ట్ హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టే రేసు నుంచి ఆయన స్వయంగా తప్పుకున్నారు. ఇంగ్లాండ్ రెడ్-బాల్ (టెస్ట్) ఫార్మాట్ కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ తప్పుకున్న నేపథ్యంలో, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆండీ ఫ్లవర్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, తాను ప్రస్తుతం చేస్తున్న పనితో ఎంతో సంతోషంగా ఉన్నానని, ఈ దశలో ఎలాంటి మార్పులు కోరుకోవడం లేదని ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశారు.

నేను చేస్తున్న పనితో చాలా సంతోషంగా ఉన్నా: 
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో తనకు చర్చలు జరిగాయనే విషయాన్ని ఆండీ ఫ్లవర్ స్వయంగా అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను చేస్తున్న పని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.. నేను కొన్ని అద్భుతమైన సంస్థలతో కలిసి పని చేస్తున్నాను.. నా చుట్టూ మంచి ఆటగాళ్లు ఉన్నారు.. ఇంగ్లాండ్ జాతీయ జట్టు హెడ్ కోచ్ పదవి ఖాళీగా ఉందనే విషయం మనందరికీ తెలిసిందే.. దీనిపై నేను ఈసీబీతో కూడా మాట్లాడాను.. కానీ, ఈ సమయంలో నేను కోచ్ పదవి రేసు నుంచి తప్పుకుంటున్నాను అని స్పష్టం చేశారు.

ఆర్‌సీబీతో బ్యాక్-టు-బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్: 
ఆండీ ఫ్లవర్‌కు ఇంగ్లాండ్ జట్టుతో ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఆయన గతంలో 2009 నుంచి 2014 వరకు ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించారు. ఆధునిక క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు అత్యంత విజయవంతమైన కాలాల్లో అది ఒకటిగా నిలిచింది. ఆ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకుంటూ, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం ఎవరికైనా ఒక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆగస్టు 2023లో ఆయన ఆర్‌సీబీ (RCB) హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతడి మార్గదర్శకత్వంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో వరుసగా బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. అందుకే ఆయన ప్రస్తుతానికి ఆర్‌సీబీతోనే తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు. 

రేసులో నిలిచిన ఇతర దిగ్గజాలు: 
ఆండీ ఫ్లవర్ ఈ రేసు నుంచి తప్పుకోవడంతో, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) హెడ్ కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ పేరు ఇప్పుడు పరిశీలనలో ముందు వరుసలో ఉంది.

ఈసీబీ షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులు:  
* జస్టిన్ లాంగర్ 
* స్టీఫెన్ ఫ్లెమింగ్
* కుమార్ సంగక్కర
* టామ్ మూడీ
* మైక్ హెసన్
* జోనాథన్ ట్రాట్
* రిచర్డ్ డాసన్
* ఆది బిరెల్