ధర్మపురి, కోటిలింగాల పుణ్యక్షేత్రాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రాబోయే రోజుల్లో ఈ ఆలయాలను టెంపుల్ సిటీగా మార్చి, అద్భుతమైన టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని రైతులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు బోర్లు, సీసీ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో దాదాపు 200 కోట్ల రూపాయల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. దేవుడి పేరుతో, రాముడి పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో మద్దతు కూడబెట్టుకోవడానికి, టూ-థర్డ్ (2/3) మెజారిటీ సాధించడం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని.. అందులో భాగంగానే టీఎంసీ ఎంపీలను కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు.
ఏసీబీ, సీబీఐ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరింపులకు గురిచేస్తోందని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తాము గట్టిగా గళం విప్పుతామని... తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
