తిరుపతిలో నకిలీ పోలీస్ కలకలం సృష్టించాడు. ఎస్ఐ ని అంటూ లాడ్జి మేనేజర్ ని బెదిరించి రూమ్ తీసుకున్నాడు. శనివారం ( జులై 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విహా హోమ్ స్టే మేనేజర్ ను బెదిరించాడు ఓ నకిలీ ఎస్ఐ. ఓ మహిళతో హోం స్టే కి చేరుకొని తాను పోలీస్ అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ కావాలనే డిమాండ్ చేశాడు.
ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల నుండి 7 గంటల వరకు రూమ్ లోనే ఇరువురు ఉన్నారు. ఎంతసేపైనా బయటికి రాకపోవడంతో తలుపు తట్టారు సిబ్బంది. అయినప్పటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి స్టే యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది.
హోమ్ స్టే దగ్గరికి చేరుకున్న పోలీసులు అతడిని నకిలీ పోలీసుగా గుర్తించి పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడ్డ నకిలీ పోలీస్ గుంటూరు జిల్లా, చోడయపాలెం కు చెందిన దాసరి కార్తీక్ గా గుర్తించారు పోలీసులు. హోమ్ స్టే యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలిపిరి పోలీసులు.
