తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సాయిరూప్ నల్లారి కీలక ప్రకటనలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని కేవలం నినాదాలకు పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా మలచాలనే సంకల్పంతో దాదాపు 10 ఏళ్ల క్రితం ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. అభిమానం ద్వారా సమాజానికి మేలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
సేవకు హద్దులు లేవన్న నమ్మకం..
సమాజంలో అవసరమైన చోట సేవ అందించాలనే భావనతో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పనిచేస్తోందని సాయిరూప్ పేర్కొన్నారు. నందమూరి కుటుంబం రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిందని గుర్తు చేస్తూ.. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరినీ "రా ఎన్టీఆర్" అనే ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
మూడు కొత్త కార్యక్రమాల ప్రకటన..
ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున మూడు ప్రధాన కార్యక్రమాలను ప్రకటించారు. "సేవతో యువ జాగృతి" పేరుతో యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు రైతుల కోసం ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రజల సమస్యలు పాలకుల దృష్టికి..
"ఊరి మాట – పాలకుల దాకా" కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సాయిరూప్ నల్లారి వెల్లడించారు. ఈ 3 కార్యక్రమాలను తొలుత ట్రయల్ ప్రాతిపదికన ప్రారంభించి, ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా అభిమాన శక్తిని సానుకూల మార్పుకు వినియోగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
