ఆధ్యాత్మికం: ఘనంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు..బోడుప్పల్ లో విశేషంగా హోమాలు.. పూజలు

ఆధ్యాత్మికం:  ఘనంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు..బోడుప్పల్ లో విశేషంగా హోమాలు.. పూజలు

వారాహి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్​ లో ఘనంగా జరుగుతున్నాయి.  జులై 23 వరకు జరిగే ఈ ఉత్సవాలు బోడుప్పల్​ శ్రీ మహాకాళేశ్వరస్వామి సహిత బంగారు మైసమ్మ దేవాలయంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి.   భక్తులు నగరంలో పలు ప్రదేశాల నుంచి స్వామి.. అమ్మవార్ల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు ( జులై 23 వరకు)  చండి, వారాహి హోమాలు, చతుషష్ఠిపూజ, శ్రీచక్ర పూజ, సప్తహారతులు కార్యక్రమాలు జరుగుతాయని  ఆలయ కమిటి చైర్మన్​బొమ్మక్​ శివ, ఆలయ ప్రధాన అర్చకులు సుమంత్​ శర్మ తెలిపారు.  

విశ్వశాంతి.. లోక కళ్యాణం కోసం జరిగే  వారాహి నవరాత్రి ఉత్సవాలల్లో భాగంగా  చాలామంది భక్తులు దీక్ష తీసుకొని నియమ నిష్ఠలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.  వారాహి అమ్మవారికి జరిగే పూజల్లో అందరూ పాల్గొనేందుకు ఆలయ కమిటి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  సామూహిక చండి యాగం.. కుంకుర్చన.. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయంలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.  

వారాహి దేవిని రాత్రి సమయాలలో పూజించడం అత్యంత శ్రేష్ఠం. సాధారణంగా రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య చేసే పూజలు, జపాలు అమ్మవారికి త్వరగా చేరుతాయని పండితులు చెబుతున్నారు. 

ఇప్పటికే ప్రారంభమైన వారాహి నవరాత్రి ఉత్సవాలు( జులై 17) నాటికి మూడు రోజులు వైభవంగా జరిగాయి.  మిగిలిన ఐదు రోజుల పాటు బోడుప్పల్​ శ్రీ మహాకాళేశ్వరస్వామి సహిత బంగారు మైసమ్మ దేవాలయంలో సాయంత్రం వేళలలో  చాలా విశేషంగా (జులై 18 నుంచి జులై 23)  పూజలు జరుగనున్నాయి. ఏ రోజు ఎలాంటి పూజ జరుగుతుంది.  దానివలన వచ్చే ఫలితాల వివరాలు ఇవే..! 

  • జులై 18:  శ్రీ ధూమ్రా వారాహి.. శ్రీ చక్ర పూజ :  దుష్ట శక్తుల నివారణ, భయాలు తొలగుట
  • జులై 19: శ్రీ అశ్వారూడ వారాహి.. సుహాసిని  పూజ:  ప్రతి పనిలో విజయం, అధికార ప్రాప్తి, నాయకత్వ లక్షణాలు వృద్ది,శౌర్యం కలుగుట
  • జులై 20: శ్రీ బృహద్​ వారాహి: కుమారికా పూజ:  మహాఐశ్వర్యం వృద్ది, రాజ సౌభాగ్యం, సంపూర్ణ రక్షణ
  • జులై  21: శ్రీ ఉన్మత్త వారాహి:  విశేషంగా చండీ.. వారాహి హోమాలు:  శత్రు దమనము, చెడు గ్రహాల దుష్టి దోష నివారణ, అపమృత్యు భయ నివారణ
  • జులై 22: శ్రీ పంచమీ వారాహి: చండి హోమం, మహా పూర్ణాహుతికి ఆవాహన పూజ:  విద్య, ఙ్ఞానం, సౌభాగ్యం, సంతాన అభివృద్ది ( సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ పూజ చేస్తే చాలా మంచిది)
  • జులై 23: శ్రీ మహా వారాహి నవరూపాల పరిపూర్ణ స్వరూపిణి పూజ: మహాపూర్ణాహుతి.. మంగళహారతులు:   ధర్మ, అర్థ,కామ,మోక్షాల కోసం విశేషమైన పూజలు జరుగును.

వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగింపు రోజు ( జులై 23)న దేవాలయ ప్రాంగణంలో అన్నదానం ఏర్పాటు చేశామని వారాహి నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. 

 వారాహి దేవి నవరాత్రులను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు, వీటినే "ఆషాఢ గుప్త నవరాత్రులు" అని కూడా అంటారు.  జూలై 23గురువారం వరకు  జరగనున్నాయి.హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రులలాగే ఈ ఆషాఢ నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సమయంలో లలితా త్రిపుర సుందరి దేవి సేనాధిపతి అయిన శ్రీ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.