Argentina vs Spain: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup Final 2026) మహాసంగ్రామం ముగింపు దశకు చేరింది. ఆదివారం అర్ధరాత్రి జరిగే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్ స్పెయిన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమెరుగకుండా అజేయంగా ఫైనల్ చేరినప్పటికీ, ప్రస్తుత ఫామ్, వ్యూహాల పరంగా స్పెయిన్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫుట్‌బాల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రత్యర్థికి బంతి దొరకనివ్వని వ్యూహం:
స్పెయిన్ ప్రధాన బలం వారి ఐకానిక్ టికీ-టాకా (Tiki-Taka) వ్యూహం.. టికీ-టాకా అంటే కేవలం చిన్న చిన్న పాస్‌లు ఇచ్చుకోవడం కాదు, ప్రత్యర్థికి అస్సలు బంతి దొరకకుండా చేస్తూ మ్యాచ్ వేగాన్ని, నియంత్రణను తమ చేతుల్లో ఉంచుకోవడం. 2010 ప్రపంచకప్‌లో స్పెయిన్ ఇదే తత్వంతో నాకౌట్ దశలో అన్ని మ్యాచ్‌లను 1–0తోనే గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఒక గోల్ చేస్తే చాలు... ప్రత్యర్థికి తిప్పికొట్టే అవకాశం ఇవ్వొద్దనే మైండ్ సెట్ వారిది.
మైండ్ రీడింగ్ డిఫెన్స్:
ప్రస్తుత 2026 ప్రపంచకప్‌లో స్పెయిన్ ఈ పాత తత్వానికి అత్యంత క్రమశిక్షణతో కూడిన డిఫెన్స్‌ను జోడించింది. కోచింగ్ బృందం ప్రత్యర్థి ఆటగాళ్ల శైలిని ముందుగానే విశ్లేషించడం వల్ల స్పెయిన్ డిఫెండర్లు బంతి ఎక్కడికి వెళ్తుందో ముందే ఊహించి అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా దూసుకుపోతున్న స్పెయిన్.. ఈ టోర్నీలో ఆస్ట్రియా (3–0), పోర్చుగల్ (1–0), బెల్జియం (2–1), ఫ్రాన్స్ (2–0)లను ఓడించి ఫైనల్ చేరింది.
ఒకే ఆలోచన.. ఒకే లక్ష్యం:
గతంలో 1964, 2008, 2012, 2024 యూరో కప్‌లు, 2010 ప్రపంచకప్ విజయాలు స్పెయిన్ జట్టు సమిష్టి కృషికి నిదర్శనం. స్పెయిన్ గొప్పతనం కేవలం ఒకరిద్దరు స్టార్ ఆటగాళ్లపైనే ఆధారపడి లేదు, మొత్తం జట్టు అంతా ఒకే వ్యూహంతో కదలడంలో ఉంది. మరి ఈ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా స్పెయిన్ డిఫెన్స్ ను బద్దలు కొడుతుందో లేదో చూడాలి.. ఏది ఏమైనా, స్పెయిన్ కేవలం ఫుట్‌బాల్ ఆడటం లేదు, ప్రత్యర్థి ఆలోచనా సరళినే మార్చేసే అద్భుతమైన ఆట ఆడుతోంది.
