వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలనే వేయాలని... ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు మంత్రి వివేక్ . మెదక్ జిల్లాలో ఎల్ నినో (El Nino) పరిస్థితులపై మంత్రి వివేక్ రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం తరపున భారీగా సబ్సిడీలు కూడా అందిస్తామని ప్రకటించారు. ఎల్ నినో పరిస్థితులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాలు బాగా పడి, రికార్డు స్థాయిలో పంటలు పండాయని... కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మంత్రి వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. జులై నెల ముగుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఎల్ నినో ఎఫెక్ట్ కేవలం మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉందన్న మంత్రి... దీనిపై ఇప్పటికే క్యాబినెట్‌లో కూడా చర్చించామని తెలిపారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన మంచినీటి కొరతతో పాటు, కరెంట్ కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు సాంప్రదాయ వరి పంటకు ప్రాధాన్యం ఇవ్వొద్దని మంత్రి స్పష్టం చేశారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటల జోలికి వెళ్ళకుండా... కరువును తట్టుకునే ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని పిలుపునిచ్చారు.
