ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. మోడీ రాజీనామా చేయాలి: కాక్రోచ్ పార్టీ కొత్త డిమాండ్

ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. మోడీ రాజీనామా చేయాలి: కాక్రోచ్ పార్టీ కొత్త డిమాండ్

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నిరసనగా ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం చేసినా మా  ఉద్యమం ఆగదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోనమ్ స్థానంలో  మేం ఇక్కడే ఉంటాం.. ఇక్కడే మా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ముందుగా చెప్పినట్లే జులై 20న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం చేసి తీరుతామని తేల్చిచెప్పింది.

ఈ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్ చుక్‎ దీక్షను భగ్నం చేసినంత మాత్రాన మా ఉద్యమం ఆగుతుందనుకుంటే అది వారి పొరపాటేనని అన్నారు. మేము ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం.. కానీ శాంతియుతంగా చేస్తోన్న మా దీక్షను భగ్నం చేశాక ఇప్పుడు ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని దీప్కే పేర్కొన్నారు. 

మేం ఇక్కడే ఉంటాం.. సోనమ్ స్థానంలో దీక్షను యధావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జులై 20న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ వెనక్కి తగ్గొద్దని.. పెద్ద ఎత్తున జంతర్ మంతర్‎కు తరలిరావాలని మద్దతుదారులకు సూచించారు. 

సోనమ్ వాంగ్ చుక్‎ను దీక్షా శిబరం నుంచి పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీజేపీ మద్దతుదారులపై పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. శాంతియుతంగా చేస్తోన్న తమ దీక్షను భగ్నం చేసి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని అన్నారు. మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకు రెట్టింపు వేగంతో మా ఉద్యమం మరింత విస్తరిస్తుందని హెచ్చరించారు.