ఆరోగ్యానికి మంచిదని గ్రీన్ టీ ఇష్టం వచ్చినట్లు తాగుతున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ఆరోగ్యానికి మంచిదని గ్రీన్ టీ ఇష్టం వచ్చినట్లు తాగుతున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత చాలామంది ప్రతిరోజు  డైట్‌లో గ్రీన్ టీ ఒక ముఖ్య భాగమైపోయింది. బరువు తగ్గాలనుకునేవారు, రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచుకోవాలనుకునేవారు రోజు తప్పకుండా గ్రీన్ టీ తాగుతున్నారు. అందుకే గత పదేళ్లలో దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్  లేదు. అయితే, మంచిది కదా అని మోతాదుకు మించి తాగినా, లేదా సరైన పద్ధతిలో తీసుకోకపోయినా లేనిపోని ఇబ్బందులు తప్పవు. గ్రీన్ టీ తాగేటప్పుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దామా...

భోజనానికి, టీకి మధ్య గ్యాప్ ఉండాలి: తిన్న వెంటనే గ్రీన్ టీ తాగడం లేదా గ్రీన్ టీ తాగిన వెంటనే ఏదైనా తినడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఆహార జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే తినడానికి, తాగడానికి మధ్య కచ్చితంగా కొంత సమయం గ్యాప్ ఇవ్వాలి.

పుదీనా ఆకులు మోతాదులో  వేసుకోవాలి: గ్రీన్ టీలో పుదీనా ఆకులు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పోషకాలు వస్తాయని చాలామంది పొరబడుతుంటారు. కానీ, మీరు తీసుకునే టీ పరిమాణాన్ని (క్వాంటిటీని) బట్టి కేవలం రుచికి సరిపడా మాత్రమే వాటిని వాడుకోవాలి.

ఆస్వాదిస్తూ, నెమ్మదిగా తాగాలి: సమయం లేదనో, వేరే పనుల హడావుడిలోనో గ్రీన్ టీని హడావుడిగా తాగేయకూడదు. అందులోని ఫ్లేవర్స్, ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి పూర్తిగా అందాలంటే.. వేడి వేడి టీని నెమ్మదిగా ఒక్కో సిప్ చేస్తూ తాగాలి.

మందులతో పాటు వద్దు: మీరు ఏదైనా అనారోగ్యంతో టాబ్లెట్స్ వాడుతున్నట్లయితే, ఆ మందులు వేసుకున్నాక గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. టాబ్లెట్స్‌లో ఉండే రసాయనాలు గ్రీన్ టీతో రియాక్ట్ అవ్వడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గ్రీన్ టీని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకుంటేనే దాని పూర్తి ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి !