రైలు ప్రమాద బాధితులకు సుప్రీంకోర్టు ఊరట: టికెట్ పోయినా సరే.. రూ. 8 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే!

 రైలు ప్రమాద బాధితులకు సుప్రీంకోర్టు ఊరట: టికెట్ పోయినా సరే.. రూ. 8 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే!

రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు  చారిత్రాత్మక తీర్పుతో పెద్ద ఊరటనిచ్చింది. రైలు ప్రమాదం జరిగినప్పుడు రైలు టికెట్ కనిపించలేదనే ఒకే ఒక్క కారణంతో బాధితుల కుటుంబాలకు పరిహారం నిరాకరించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. రైల్వే చట్టాలు అనేవి ప్రజల సంక్షేమం కోసం చేసినవని.. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేలా వీటిని ఉపయోగించాలే తప్ప, సాంకేతిక కారణాలు చూపి చేతులు దులుపుకోకూడదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.

అసలు కోర్టు ఏం చెప్పిందంటే 
2015లో ఒక వ్యక్తి కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి చనిపోయాడు. అతని భార్య లత నష్టపరిహారం కోసం రైల్వే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తన భర్త టికెట్ కొన్నాడని, కానీ ప్రమాదం జరిగినప్పుడు ఆయన  లగేజీ పోవడంతో టికెట్ దొరకలేదని ఆమె కోర్టుకు తెలిపింది.

అయితే రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, ఆ తర్వాత హైకోర్టు కూడా "టికెట్ లేదు కాబట్టి పరిహారం ఇవ్వలేం" అంటూ ఆమె దరఖాస్తును కొట్టేసాయి. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు:

కింది కోర్టుల తీర్పును తప్పుబడుతూ.. బాధిత మహిళకు నాలుగు వారాల్లోగా రూ. 8 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వేను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైతే, దానికి 8% వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

 ప్రమాద తీవ్రత వల్ల టికెట్ పోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఆ వ్యక్తి టికెట్ లేకుండానే ప్రయాణించాడని అనుకోలేం. బాధిత కుటుంబం ఇచ్చే అఫిడవిట్ (వాంగ్మూలం) ఆధారంగానే వారు నిజమైన ప్రయాణికులా కాదా అనేది అంచనా వేయాలి. రైల్వే చట్టం ప్రకారం ప్రమాదం జరిగితే బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం రైల్వే కనీస బాధ్యత. రైల్వే నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు నిరూపించాల్సిన అవసరం లేదు.

 రైలు ఎక్కేముందు, ఎక్కిన తర్వాత టికెట్లను తనిఖీ చేసే వ్యవస్థ రైల్వేకు ఉంది. ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడా లేదా అనేది రైల్వే  రికార్డుల ద్వారా ముందే చూసుకోవాలి కానీ, ప్రమాదం జరిగాక టికెట్ చూపించమనడం సరికాదు.

రైలు రద్దీ, భద్రతపై ఆందోళన 
నష్టపరిహారంతో పాటు రైళ్లలో విపరీతంగా పెరుగుతున్న రద్దీ, భద్రతా లోపాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతను మెరుగుపరచడానికి మరిన్ని రైల్వే ఉద్యోగాలను సృష్టించాలని, ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చని రైల్వే శాఖకు కోర్టు సూచించింది. సాంకేతిక కారణాలు చూపి రైల్వే పరిహారం ఎగ్గొట్టకుండా, ప్రయాణికుల హక్కులను కాపాడే దిశగా ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది.