వైద్యవృత్తి నిర్వహించాలని.. ఎంబీబీఎస్ అంటే ప్యాషన్ తో నీట్-2026 పరీక్ష రాశారు 71 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్ . నీట్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా.. హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.సీనియర్ సిటిజన్స్ కు MBBS లో రిజర్వేషన్ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారాయన. వివరాలేంటో తెలుసుకుందాం.
అశోక్ బహర్ అనే వృద్ధుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఒక శాతం (1%) రిజర్వేషన్ కల్పించాలంటూ రిట్ పిటిషన్ వేశారు. జులై 21న ఈ కేసు వాదనకు రానుండటంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వయసులో రిజర్వేషన్ ఎందుకు కోరుతున్నారు..?
మెడికల్ ఎంట్రెన్స్, మెడికల్ అడ్మిషన్స్ లో అనేక ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు, సీనియర్ సిటిజన్స్( వయోవృద్ధులకు) ఎందుకు ఇవ్వడం లేదని బహర్ పిటిషన్‌లో ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన సింపుల్ వాదన చేస్తున్నారు. నీట్ పరీక్ష రాయడానికి వయస్సు అడ్డంకి కానప్పుడు, వైద్య సీటు సంపాదించడానికి ఇవ్వడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నీట్-యూజీకి పరీక్షకు అప్పర్ ఏజ్ లిమిట్ ను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆయన తరఫు న్యాయవాది పంకజ్ ధీర్ సింగ్ రాణా ప్రస్తావించారు. సీనియర్ సిటిజన్లు మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు చట్టబద్ధంగా హాజరు కాగలిగినప్పుడు, అడ్మిషన్స్ కు మద్దతు ఇచ్చేందుకు ఫ్రేమ్ వర్క్ కూడా ఉండాలని పిటిషన్‌లో వాదించారు.
వయసు పెరిగినా చావని 52 ఏళ్ల కల..
బహార్ డాక్టర్ కావాలన్నది 52 ఏండ్ల కల. 1974లో తొలిసారిగా మెడికల్ ఎంట్రెన్స్ రాశాడు.. కానీ ఆ ఎగ్జామ్ లో పాస్ కాలేదు. 2023లో మళ్ళీ ప్రయత్నించాడు, కానీ దూరం కారణంగా పరీక్ష కేంద్రానికి ఆలస్యం అవ్వటంతో పరీక్ష రాయలేకపోయాడు. అయినా నిరాశపడలేదు. ఈ ఏడాది మే నెలలో నీట్ యూజీ 2026 పరీక్షకు హాజరయ్యాడు.
బహార్ డాక్టర్ అయితే చూడాలని అతని తల్లి సావిత్రి దేవి కలలు కన్నదట. కానీ ఆమె 1990లో మరణించారు. అమ్మ కోరిక తీర్చలేకపోయానని.. ఆ కల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు బహార్. ఆ తర్వాత అతని భార్య, డాక్టర్ మంజు బహార్, కూడా.. ప్రయత్నించమని ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
బహార్ కుటుంబంలో దాదాపు అందరూ డాక్టర్లే. సుమారు 20 మంది వైద్యులు ఉన్నారు. వారిలో చాలామంది విదేశాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఆయన కేవలం నీట్ ఆస్పిరెంట్ మాత్రమే కాదు..
71 ఏళ్ల వయసులోనూ, బహార్ అకడెమిక్, ప్రొఫెషనల్ బ్యాగ్రౌండ్ మామూలుదేం కాదు. లక్నో యూనివర్సిటీ నుంచి BZC ( బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎంబీఏ పట్టాలను పొందారు.
ప్రొఫెషన్ పరంగా ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు మార్కెటింగ్ హెడ్‌గా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. హైకోర్టులో ప్రాక్టీసింగ్ న్యాయవాదిగా కూడా ఉన్నారు.
చదువుకు వయోపరిమితి లేదని బహార్ అంటున్నారు. జీవిత చరమాంకంలో తమ అసంపూర్తిగా కలలను నెరవేర్చుకోవాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు కల్పించాలని కోరుతున్నారు.
