హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు: చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు: చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తూ, స్థానిక ప్రజలతో ఆయన ముచ్చటించారు. పట్టణంలోని పలు వార్డుల్లో స్వయంగా పర్యటించి, అక్కడి ప్రజలను అడిగి వార్డు సమస్యలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ పోచమ్మ వీధిలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన నూతన బోర్ వేల్ ను మంత్రి వివేక్ ప్రారంభించారు.


విద్యార్థినుల సమస్యలపైనా మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చెన్నూరు పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) ఆయన ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ లలో అందుతున్న వసతులు, భోజనం నాణ్యత ,ఇతర సమస్యలపై విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి వివరాలు సేకరించారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో బెంచీలు లేవని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన తక్షణమే బెంచీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్డెన్లను హెచ్చరించారు.