బీటెక్ లో మరో 4,347 కొత్త సీట్లు ..మొదలైన ఎప్ సెట్  సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు

బీటెక్ లో మరో 4,347 కొత్త సీట్లు ..మొదలైన ఎప్ సెట్  సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు
  •     స్టూడెంట్లకు అందుబాటులోకి 31,834 సీట్లు
  •     ఇప్పటివరకు 27 వేల మంది ఆప్షన్లు.. నేడు ఆఖరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్‌‌‌‌లో కొత్త సీట్లకు సర్కారు అనుమతి ఇచ్చింది. కన్వీనర్ కోటాలో వివిధ కాలేజీల్లో ఏకంగా 4,347 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. సర్కారు పర్మిషన్ ఇవ్వడంతో వాటిని సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌‌లో చేర్చారు. కాగా, శనివారం ఉదయం నుంచి వెబ్ఆ ప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగియనున్నది. ఇప్పటికే 27,487 సీట్లు అందుబాటులో ఉండగా, తాజాగా కొత్త సీట్లతో కలిపి కన్వీనర్ కోటాలో మొత్తం 31,834 సీట్లు రెడీగా ఉన్నాయి.

కంప్యూటర్​ సైన్స్, దాని అనుబంధ కోర్సులే ఎక్కువ.. 

కొత్తగా అందుబాటులోకి వచ్చిన 4,347 సీట్లలో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులే ఉన్నాయి. సీఎస్ఈ(ఏఐఎంఎల్)లో 1,008 సీట్లు, ఈసీఈలో 879 సీట్లు, సీఎస్​ఈ లో 672 సీట్లు, సీఎస్ఈ డేటాసైన్స్ లో 378 సీట్లు, ఎలక్ర్టానిక్స్ ఇంజినీరింగ్ లో 231, సివిల్ లో  189, ఈఈఈలో 168 సీట్లు,  మెకానికల్ ఇంజినీరింగ్ లో 231 సీట్లు అందుబాటులోకి  వచ్చాయి. మొత్తం 17 బ్రాంచీల్లో ఈ సీట్లు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో పాటు మరో 435 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు పెరిగాయి. కాగా, ఆదివారం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆఖరు కావడంతో.. అభ్యర్థులు పెరిగిన సీట్లను దృష్టిలో ఉంచుకుని తమ ప్రాధాన్యతలను సరిచూసుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. శనివారం మొత్తం 27,197 మంది అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు కొత్తగా 2,622 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తయింది.