సినిమా రంగంలో ప్రతి ఒక్కరి సక్సెస్ జర్నీ ఒకేలా ఉండదు. కొందరు తొలి సినిమాతోనే స్టార్‌లు అవుతారు. మరికొందరు మాత్రం ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంవత్సరాలపాటు శ్రమించి తమకంటూ గుర్తింపు సంపాదిస్తారు. మలయాళ నటుడు సిజు విల్సన్ ప్రయాణం రెండో కోవకు చెందినది. పెద్ద సినీ కుటుంబం అండ లేకపోయినా, ఒక్కో పాత్రతో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడు.
సిజు విల్సన్ అసలు పేరు విల్సన్ జోసఫ్. కేరళలోని అలువాలో పుట్టాడు. బాగా చదివి స్థిరమైన ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచనతో బీఎస్సీ నర్సింగ్ చదివాడు. నర్సింగ్ పూర్తయిన తర్వాత అదే రంగంలో స్థిరపడే అవకాశం ఉన్నా, తన మనసు మాత్రం నటనవైపే లాగింది. సినిమాల్లో అవకాశాలు వస్తాయో రావో తెలియని పరిస్థితిలో కూడా తనకు నచ్చిన దారినే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం వెనుక రిస్క్ ఉన్నా, తనపై నమ్మకం ఎక్కువగా ఉంది.
చిన్న పాత్రలతో మొదలైన కెరీర్
2010లో విడుదలైన మలార్వాడి ఆర్ట్స్ క్లబ్ సినిమాతో సిజు తెరపై కనిపించాడు. తర్వాత నేరం, ప్రేమమ్, హ్యాపీ వెడ్డింగ్, కట్టప్పనయిలే ఋత్విక్ రోషన్, ఆది వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ పరిశ్రమలో తన ఉనికిని చాటుకున్నాడు. టెలివిజన్ కార్యక్రమాల్లోనూ కనిపించిన ఆయనకు అక్కడ వచ్చిన గుర్తింపు సినిమా అవకాశాలు పెరగడానికి ఉపయోగపడింది. ఒక్కో పాత్ర ఆయనను మరో మెట్టుకు తీసుకెళ్లింది.
ప్రేమమ్ తర్వాత వచ్చిన గుర్తింపు
ప్రేమమ్ తర్వాత సిజు పేరు ప్రేక్షకుల్లో మరింత వినిపించింది. ఆ సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నదే అయినా, సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకులు కూడా ఆయనను కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టారు. తెరపై పాత్రకు ఎంత అవసరమో అంత మాత్రమే చేయడం ఆయన ప్రత్యేకతగా మారింది. చిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సిజు, ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నాడు. ముఖ్యంగా ‘వరయన్’, ‘పత్తోన్పథం నూట్టాండు’ వంటి సినిమాలు ఆయనను ప్రధాన కథానాయకుడిగా నిలబెట్టాయి. సహాయ నటుడి నుంచి హీరోగా ఎదగడం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా మారింది.
నిర్మాతగా తీసుకున్న సవాల్
మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతగా కూడా అడుగుపెట్టాడు. నటుడిగానే కాకుండా, కథ ఎంపికలోనూ తన అభిరుచిని చూపించాలని భావించాడు. ఆ ఆలోచనతోనే ‘వసంతి’ సినిమా తెరకెక్కించాడు. సిజు కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా ‘వసంతి’. ఈ సినిమాను ఆయన నిర్మించడమే కాకుండా, నటుడిగానూ తన వంతు బాధ్యత తీసుకున్నాడు. 2016లో మొదలైన ఈ సినిమా నిర్మాణం పూర్తవ్వడానికి మూడేళ్లకు పైగా పట్టింది. మధ్యలో ఆర్థిక, నిర్మాణ సమస్యలు ఎదురైనా బృందం వెనక్కి తగ్గలేదు. చివరకు సినిమా విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం ఆ శ్రమకు దక్కిన గుర్తింపుగా నిలిచింది.
ఎదురైన సవాళ్లు
సినీ పరిశ్రమలో నిలబడటం అంత ఈజీ కాదు. కొత్తవారికి అవకాశాలు రావడం ఒక కష్టం అయితే, వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం మరో పెద్ద సవాలు. సిజు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మొదట్లో చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. మంచి పాత్ర కోసం చాలాసార్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా తొందరపడకుండా, తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగాడు. అందుకే ఆయన కెరీర్‌లో వేగం కంటే స్థిరత్వం.
చివరిగా.. నర్సింగ్ చదివిన యువకుడిగా మొదలైన ప్రయాణం, చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగిన ప్రస్థానం, నిర్మాతగా తీసుకున్న సాహసం.. ఇవన్నీ సిజు విల్సన్ కెరీర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. హడావుడి కంటే క్రమంగా ఎదగడానికే ప్రాధాన్యం ఇచ్చిన ఆయన ప్రయాణం, కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
పాత్ర కోసం పడిన కష్టం
‘పత్తోన్పథం నూట్టాండు’ సిజు కెరీర్‌లో మరో ముఖ్యమైన సినిమా. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం సిజు చాలాకాలం సిద్ధమయ్యాడు. శరీరాకృతిని మార్చుకోవడం, యుద్ధ విద్యలో శిక్షణ తీసుకోవడం, గుర్రపు స్వారీ నేర్చుకోవడం వంటి అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. తెరపై కొన్ని గంటలు కనిపించే పాత్ర కోసం నెలల తరబడి చేసిన సాధన ఆయన అంకితభావాన్ని చూపించింది. ఈ అవకాశం కూడా ఒక్కసారిగా రాలేదు. గతంలో చేసిన పాత్రలను చూసిన తర్వాతే దర్శకుడు ఆయనను ఎంపిక చేశాడు. ప్రతి చిన్న పాత్ర కూడా భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారి తీస్తుందని సిజు ప్రయాణం చెప్తుంది.
కుటుంబమే బలమైన అండ
వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబం ఆయనకు పెద్ద బలంగా నిలిచింది. భార్య శ్రుతి విజయన్ ఎప్పటికప్పుడు ఆయనకు అండగా నిలిచారు. సినిమా షూటింగ్‌లు, ప్రయాణాలు, ఒత్తిడుల మధ్య కుటుంబం ఇచ్చిన మద్దతు తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని ఆయన పలుమార్లు చెప్పారు. 2021లో కూతురు మెహర్ పుట్టిన తర్వాత తన జీవితంలో కొత్త బాధ్యత మొదలైందని కూడా తెలిపారు.
డోస్ గురించి..
రీసెంట్గా ‘డోస్’ సినిమాతో సిజు మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆసుపత్రి నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. హత్యలు, అనుమానాలు, దర్యాప్తు చుట్టూ తిరిగే కథలో గతంలో కనిపించని తరహా పాత్రను ప్రయత్నించాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ఎక్కువగా కనిపిస్తుంది. ‘‘ఎన్నో సంవత్సరాల కష్టాన్ని టీం డోస్ సినిమా కోసం పెట్టిందని, ప్రేక్షకుల స్పందనే ఆ శ్రమకు నిజమైన ఫలితమని పేర్కొన్నారు. అలాగే నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు.
