హైదరాబాద్ సిటీ మొత్తం బోనాల శోభతో కలకలలాడుతోంది. గోల్కొండ ఎల్లమ్మకు తొలిబోనం పూర్తయిన తర్వాత.. ఇటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ, అటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో బోనాల సందడి మొదలైంది. ఆదివారం (జులై 19 పాత బస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. అదే సమయంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటాల ఊరేగింపు కూడా మొదలవడంతో నగరం అంతా సందడి వాతావరణం నెలకొంది.
ఆషాఢ మాస బోనాలు పండుగ సందర్బంగా భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ.. సప్త మాతృకలకు -సప్త బంగారు బోనం కార్యక్రమం నిర్వహించింది. ఊరేగింపు కమిటీ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో పాతబస్తీలో హరిబౌలి బంగారు మైసమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా పెద్దమ్మ తల్లికి బంగారు బోనం ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. వివిధ కళాకారుల నృత్యాల నడుమ భాజ భజంత్రీలతో జోగిని అవికా దేవి నృత్యాలతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు. ఊరేగింపు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘటాల ఎదుర్కోలు కార్యక్రమం చేపట్టారు. ఆషాడం మొదటి ఆదివారం ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఘటాల ఎదుర్కోలు కార్యక్రమం ప్రతీ ఏటా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఘటాల ఎదుర్కోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ లో ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీజే డ్యాన్సులతో, శివసత్తుల పూనకాలతో, పోతరాజుల డ్యాన్సులతో ఘటాల ఊరేగింపు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఘటాలు ఊరేగింపుగా వస్తుండటంతో సికింద్రాబాద్ వైపు రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
ప్రధాన ఘటం బోట్స్ క్లబ్ ఎదురుగా ఉన్న మహంకాళమ్మ ఆలయంలో రూపు దిద్దుకుకోనుంది. కార్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊరేగింపు గా రాత్రి ప్రధాన ఘటం రానుందని నిర్వాహకులు చెప్పారు.
