97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!

97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!

IND vs ENG: లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లీష్ టీమ్ లార్డ్స్ క్రికెట్ మైదానంలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. లార్డ్స్ పిచ్‌పై వన్డే క్రికెట్ చరిత్రలోనే నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా సిరీస్ గెలవాలంటే ఇప్పుడు 388 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. 

ఓపెనర్ల విధ్వంసం.. 30 ఓవర్ల పాటు వికెట్ లెస్: 
ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలింగ్ అటాక్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. భారత పేస్ విభాగాన్ని ముక్కలు చేస్తూ వీరిద్దరూ మొదటి వికెట్‌కు ఏకంగా 192 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుమారు 30 ఓవర్ల పాటు భారత బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కకుండా ఇంగ్లాండ్ ఓపెనర్లు క్రీజులో పక్కా ప్లానింగ్‌తో చెలరేగిపోయారు. ఈక్రమంలో బెన్ డకెట్ (135 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్సుతో 141 పరుగులు) అద్భుతమైన సెంచరీ చేసి  ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక జాకబ్ బెథెల్ (93 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు) సెంచరీకి చేరువగా ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

జో రూట్ క్లాస్.. ఆఖర్లో బట్లర్ మాస్ విధ్వంసం: 
ఓపెనర్లు ఇచ్చిన అద్భుతమైన పునాదితో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ మరింత రెచ్చిపోయింది. బెన్ డకెట్, సీనియర్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించాడు. 44వ ఓవర్లో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లోనే డకెట్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జో రూట్ (74*)తో కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు (నాటౌట్) చేసి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 20 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ స్కోరును 387/3కి చేర్చారు.

బుమ్రా లేని లోటు.. భారత బౌలింగ్ విఫలం: 
గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు (బెథెల్, హ్యారీ బ్రూక్) పడగొట్టగా, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ (బెన్ డకెట్) సాధించాడు. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్ వేసిన 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే ప్రిన్స్ యాదవ్ (79), అర్షదీప్ సింగ్ (72), ప్రసిద్ధ కృష్ణ(69),  అక్షర్ పటేల్ (61) ఇలా ప్రతి ఒక్క బౌలర్ సుమారు 60+ రన్స్ ఇచ్చి ఇంగ్లాండ్ భారీ స్కోర్ కి సహకరించారు.