మీ మౌనం కరెక్ట్ కాదు.. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నరు: అయోధ్య విరాళాల చోరీపై ప్రధాని మోడీకి రాహుల్, ఖర్గే లేఖ

మీ మౌనం కరెక్ట్ కాదు.. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నరు: అయోధ్య విరాళాల చోరీపై ప్రధాని మోడీకి రాహుల్, ఖర్గే లేఖ

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ, నిధులో గోల్ మాల్ ఇష్యూపై రాజ్యసభ, లోక్ సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర, సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. భక్తులకు నమ్మకం కలిగే విధంగా ట్రస్ట్ ఖాతాలు, సిట్ దర్యాప్తు నివేదిక బహిర్గతం చేయాలని కోరారు. దేశంలోని కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన ఈ అంశంపై ప్రధాని మోడీ మౌనం వహించడం సరికాదన్నారు. 

‘‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో వేల కోట్ల రూపాయల దొంగతనం గురించి మీకు తెలుసు. విశ్వాసం, భక్తి, నమ్మకంతో తమ కష్టార్జితాన్ని విరాళంగా ఇచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ దొంగతనంతో మోసపోయినట్లు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్లమెంటు సాక్షిగా అయోధ్య ట్రస్ట్‎ను మీరే ప్రకటించారు. 

ట్రస్ట్ సభ్యులను పూర్తిగా మీ ప్రభుత్వమే నియమించింది. ట్రస్టు సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, వాటి అనుబంధ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారనేది బహిరంగ విషయమే. ట్రస్ట్ ఏర్పాటు, బోర్డు సభ్యుల నియామకం మొత్తం మీ ద్వారానే జరిగింది. మీరు ఏర్పాటు చేసిన ట్రస్ట్‎లో ఇంతటి నేరం జరుగుతున్నప్పుడు ప్రధాని మోడీ మౌనం వహించడం ఆమోదయోగ్యం కాదు.

తమ కానుకలను ఎలా వినియోగించారో ప్రతి భక్తుడికి తెలియజేయడం మీ విధి. నగదు, బంగారం, వెండితో సహా అన్ని కానుకల నిర్వహణతో పాటు, ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర, సమగ్ర విచారణకు ఆదేశించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము’’ అని రాహుల్, ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

అయోధ్య చోరీ విరాళాలపై  ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని.. అలాగే ట్రస్ట్ ఖాతాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. హోదా, పలుకుబడితో సంబంధం లేకుండా బాధ్యులుగా తేలిన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు ఎంత పారదర్శకంగా, ఎంత వేగంగా వ్యవహరిస్తారనే దానిపైనే మీ ప్రభుత్వం, ట్రస్ట్ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.