సున్నా... రోజూ మనం లెక్కల్లో ఉపయోగించే అంకె. కానీ ఈ చిన్న గుర్తు వెనుక వేల ఏళ్ల చరిత్ర దాగి ఉందని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ చరిత్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోటలో ఉన్న చతుర్భుజ్ ఆలయంలో చెక్కిన శాసనంలో కనిపించే సున్నా గుర్తు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
దాదాపు 1200 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం గోడపై క్రీ.శ. 875 ప్రాంతానికి చెందిన ఒక శాసనం ఉంది. అందులో 270, 50 వంటి సంఖ్యలు చెక్కినట్టు కనిపిస్తాయి. వాటిలో కనిపించే గుండ్రటి గుర్తే సున్నా. ఈ శాసనం కారణంగా చాలా సంవత్సరాలపాటు గ్వాలియర్ ఆలయంలోని సున్నానే ప్రపంచంలో చెక్కబడిన అత్యంత పురాతన సున్నా గుర్తుగా గుర్తింపు పొందింది.
తర్వాత జరిగిన పరిశోధనల్లో కంబోడియాలోని సామ్‌బోర్ ప్రాంతంలో క్రీ.శ.683 నాటి మరో శాసనం వెలుగులోకి వచ్చింది. అందులో కూడా సున్నా గుర్తు ఉండటంతో, ప్రస్తుతం ప్రపంచంలో ఇప్పటివరకు గుర్తించిన అత్యంత పురాతన చెక్కిన సున్నా గుర్తు అదే అని చరిత్రకారులు భావిస్తున్నారు. అయినప్పటికీ, మనదేశంలో రాతి శాసనంపై చెక్కిన తొలి సున్నా గుర్తుల్లో గ్వాలియర్ శాసనం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.
అసలు సున్నా ఎందుకు అంత ముఖ్యమంటే.. అది కేవలం ఒక అంకె కాదు. గణిత ప్రపంచాన్నే మార్చేసిన ఆవిష్కరణ. ఒకటి, పది, వంద, వెయ్యి... ఇలా పెద్ద సంఖ్యలను ఈజీగా రాయడానికి, లెక్కలు వేయడానికి సున్నా కీలకంగా మారింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ టెక్నాలజీ.. ఇవన్నీ కూడా చివరకు సున్నా, ఒకటి అనే సంఖ్యలపైనే ఆధారపడి పనిచేస్తాయి.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సున్నా మొదట మనం ఇప్పుడు చూసేలా గుండ్రంగా ఉండేది కాదు. ప్రారంభంలో అది చిన్న చుక్క (డాట్) రూపంలో ఉండేదని పరిశోధకులు చెప్తున్నారు. కాలక్రమేణా అది గుండ్రటి ఆకారంలోకి మారి, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అంకెగా మారింది.
ఇటీవల ఈ గ్వాలియర్ ఆలయంలోని సున్నా గుర్తు గురించి అంతర్జాతీయ మీడియా మరోసారి కథనాలు ప్రచురించడంతో, ఈ చారిత్రక శాసనం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఒక చిన్న అంకె వెనుక ఇంత గొప్ప చరిత్ర ఉందా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
