పార్లమెంట్ మార్చ్‌ను సక్సెస్ చేయండి.. ఇది రెండో స్వాతంత్ర పోరాటం: ఆసుపత్రి నుంచి వాంగ్ చుక్ మెసేజ్

పార్లమెంట్ మార్చ్‌ను సక్సెస్ చేయండి.. ఇది రెండో స్వాతంత్ర పోరాటం: ఆసుపత్రి నుంచి వాంగ్ చుక్ మెసేజ్

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆసుపత్రి నుంచి దేశ యువతకు కీలక పిలుపునిచ్చారు. 2026, జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‎లో యువత పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లీకుల నుంచి దేశానికి విముక్తి కావాలని.. భయానికి, అన్యాయానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడాలని సూచించారు.

 సీజేపీ ఉద్యమాన్ని భయం, అన్యాయం నుంచి స్వేచ్ఛను కోరుతూ సాగిస్తున్న భారతదేశపు రెండో స్వాతంత్ర్య ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. ఇక, జంతర్ మంతర్‎లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తోన్న తనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడం అక్రమ నిర్భంధమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి తన భార్య గీతాంజలి ద్వారా వాంగ్ చుక్ సందేశాన్ని పంపించారు. 

నీట్ పేపర్ లీక్, దేశ విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

జులై 18కి ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది. 21 రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయన దీక్ష ఇలాగే కొనసాగిస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాంగ్ చుక్ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.