ఆధ్యాత్మికం: ధర్మానిదే తుది విజయం..కౌరవులు, రావణుడు, కంసుడు నాశనానికి కారణం ఇదే..!

ఆధ్యాత్మికం: ధర్మానిదే తుది విజయం..కౌరవులు, రావణుడు, కంసుడు నాశనానికి కారణం ఇదే..!

కురుక్షేత్ర యుద్ధం సాగుతోంది. భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా జరుగుతున్న యుద్ధంలో నాలుగవ రోజు కౌరవులు పాండవుల తాకిడికి తట్టుకోలేక వెనుకకు మరలారని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ‘సంజయా! మన వైపు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు వంటి ఇంతమంది యోధులుండగా, మనకు ఏ కారణంగా పరాజయం ఎదురవుతోంది?’ అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా 

పాడియు సత్యముం గలరు పాండు తనూజులు నీదు పుత్రుల
ప్పాడికి నోడ రత్తెఱగు పాపము సేయగ జూచి తీవు న
క్కీడిటు సేయ కేలుడుగు గెల్వదె ధర్మువు వారి గెల్పు మీ
యోడుటయు ధ్రువంబు విదురోక్తులు వింటిమి గాదె యేర్పడన్‌.

పాండవుల పక్షాన న్యాయం ఉంది. సత్యం ఉంది. అంతేకాక  కౌరవులు పాపం చేస్తూ ఉండగా నువ్వు చూస్తూ ఊరుకున్నావు. ఆ అధర్మం అప్పుడు మిమ్మల్ని కట్టి కుదపదా? ధర్మం జయించి తీరుతుంది. పాండవుల విజయం, మీ అపజయం నిశ్చయం. విదురుడు ఏనాడో చెప్పాడు కదా. అతడి మాటలు నువ్వు వినలేదా. అందరము విన్నాముగా. చేసిన పాపము అనుభవించక తప్పదు.. అని సంజయుడు ధృతరాష్ట్రుడికి సమాధానమిచ్చాడు.

పాండవులు ధర్మానికి కట్టుబడి ఉంటారు. సత్యాన్ని అతిక్రమించరు. కాని కౌరవులు పుట్టిన నాటి నుండి అధర్మంగానే జీవించారు. ఏనాడూ సత్యం పలుకలేదు. కౌరవులు పాండవులను మోసం చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నాడు. తన కుమారులను ఏనాడూ దండించలేదు. వారి పట్ల అధర్మమే ఉంది. అధర్మం ఎప్పటికీ గెలవదు. ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తి ఉండనే ఉంది. 

మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మవర్తనులైన పాండవులకి వారి రాజ్యభాగాన్ని ఇవ్వకపోవడం అధర్మం. పాండవుల కష్టాలను తొలగించి, నీడలా కాపాడవలసిన పెద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు వారి పట్ల అధర్మంగా ప్రవర్తించాడు. అందువల్లే పాండవ పక్షాన ఎంత బలం ఉన్నా, ధర్మం అనే శక్తివంతమైన బలం లేకపోవడం వల్లే వారు ఓటమి పాలవుతారని విదురుడు చెప్పాడు.

ఇక రామాయణంలోకి ప్రవేశిస్తే  

రావణుడు సీత పట్ల అధర్మంగా ప్రవర్తించాడు. మాయావిగా వెళ్లి, ఆమెను అపహరించి, లంకకు తీసుకువచ్చి అశోకవనంలో బంధించాడు. తన మాట వినకపోతే, ఆమెను చంపి ఫలహారం చేస్తాననని బెదిరించాడు. సీతను రామునికి అప్పగించటం ధర్మం అని విభీషణుడు ఎంత చెప్పినా రావణుడు వినలేదు. వాస్తవానికి రావణుడు సకల శాస్త్ర పారంగతుడు. ఎంతటి వారినైనా ఎదిరించగల శక్తిమంతుడు. అయితేనేం, అన్నిటికంటె శక్తివంతమైన ధర్మాన్ని విడనాడాడు. తాను నాశనం కావడమే కాకుండా వంశ నాశనానికి కారకుడయ్యాడు. 

శ్రీరాముడు ధర్మాన్నే నమ్ముకున్నాడు. తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేశాడు. సుగ్రీవుని వైపు ధర్మం ఉన్న కారణంగా వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. సుగ్రీవునితో చేసిన ధర్మబద్ధమైన మైత్రి కారణంగా, వానరుల సాయంతో సముద్రం మీద వారధి నిర్మించి, లంకకు చేరి, రావణుడిని సంహరించగలిగాడు. 

భాగవత గాథలో  

ఉగ్రసేన మహారాజుగారి పిల్లలు దేవకీ దేవి, కంసుడు. దేవకిని వసుదేవునికిచ్చి వివాహం చేస్తాడు మహారాజు. వారిని అత్తవారింట దిగవిడిచి రావడానికి బయలుదేరతాడు కంసుడు. మార్గమధ్యలో అశరీరవాణి, ‘కంసా! నీ సోదరి గర్భాన జన్మించే ఎనిమిదవ శిశువు చేతిలో నువ్వు మరణిస్తావు’ అని పలికింది. దానితో కంసుడు దేవకీవసుదేవులతో పాటు, తల్లిదండ్రులను కూడా చెరసాల పాలు చేశాడు. ఎన్ని చేసినా, కంసుడి అధర్మవర్తనం కారణంగా శ్రీకృష్ణుడి చేతిలో హతుడయ్యాడు. వంద తప్పులు చేసిన శిశుపాలుడు కూడా ధర్మం చేతిలో మరణించాడు. 

అవతార గాథలు, పురాణ ఇతిహాసాలు పరిశీలిస్తే...

ధర్మం ఆచరించినవారు కొంతకాలం కష్టాలు అనుభవించినా, చివరకు వారిని వారి ధర్మమే రక్షించింది. అధర్మవర్తనులను శిక్షించింది.

లౌకికంగా పరిశీలిస్తే  

నేటికీ ఎంతోమంది రకరకాల వ్యాపారాల పేరుతో సామాన్యులను మోసగించడం చూస్తూనే ఉంటాం. వారి మోసం ఎంతో కాలం సాగదు. కొంతకాలానికి వారి అధర్మ ప్రవర్తన బయటపడి, వారికి శిక్ష పడుతూనే ఉంది. అందుకే ఎప్పటికైనా ధర్మానిదే  విజయం అంటారు.

- డా. పురాణపండ వైజయంతి-