వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి మెసేజ్.. అర్జెంటీనా ఫ్యాన్స్‌కు బిగ్ హింట్!

వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి మెసేజ్.. అర్జెంటీనా ఫ్యాన్స్‌కు బిగ్ హింట్!

Lionel Messi: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup Final 2026) ఫైనల్లో స్పెయిన్‌తో మహా సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో అర్జెంటీనా కెప్టెన్  లియోనెల్ మెస్సీ తన సహచర ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు ఒక భావోద్వేగ బహిరంగ లేఖను రాశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జట్టు సభ్యులందరితో కూడిన ఒక గ్రూప్ ఫోటోను షేర్ చేస్తూ మెస్సీ పెట్టిన పోస్ట్.. బహుశా అర్జెంటీనా తరపున ఇదే అతని ఆఖరి ప్రయాణం కాబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 2–1తో విజయంలో రెండు అసిస్ట్‌లతో కీలక పాత్ర పోషించిన మెస్సీ, ఇప్పుడు ఫైనల్ ఒత్తిడిని దూరం చేసేలా జట్టును ఎంకరేజ్ చేశాడు. 

మెస్సీ ఇన్‌స్టాలో భావోద్వేగపూరిత మెసేజ్: 
మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసిన ప్రతి మాట అభిమానుల, ఆటగాళ్ల హృదయాలను కదిలిస్తోంది. తన ఇన్నేళ్ల ప్రయాణంలో మనం గెలిచిన టైటిల్స్ మాత్రమే కాదు, మనం సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణం.. ఈ అద్భుతమైన గ్రూప్‌తో ప్రతిరోజూ సమయాన్ని పంచుకోవడం, కలిసి పోటీ పడటం, కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటం, మనం అందరం కలిసి ప్రతి అడుగును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఈ జాతీయ జట్టును ఒక కుటుంబంలా ఉంచడానికి ప్రతిరోజూ శ్రమిస్తున్న నా సహచరులకు, సాంకేతిక సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. మైదానంలో ఏం జరిగినా సరే, ఈ గ్రూప్ ఇప్పటికే ఒక అద్భుతమైన చరిత్రను లిఖించింది.. దానిని మనం ఎప్పటికీ మరువలేం, ఎవరూ చెరపలేరు కూడా కమాన్ అర్జెంటీనా అని మెస్సీ రాసుకొచ్చాడు. 

ఒత్తిడిని దూరం చేస్తూ.. కెరీర్‌కు ముగింపు: 
ఈ సుదీర్ఘమైన సందేశంతో లియోనల్ మెస్సీ తన సహచర ఆటగాళ్లపై ఉన్న ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేశాడు. ఇవాళ్టి మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా, తాము సాధించిన రికార్డులు, సృష్టించిన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతాయని గుర్తు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌లో చివరిది కావచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, ఆయన మాత్రం భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టాడు. ఇంగ్లాండ్‌పై విజయం సాధించి అర్జెంటీనా ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని మెస్సీ తెలిపాడు.

వ్యక్తిగత రికార్డులపై కంటే విజయంపైనే ఫోకస్: 
మరోవైపు వ్యక్తిగత అవార్డుల రేసులో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నప్పటికీ, మెస్సీ మాత్రం వాటి గురించి పెద్దగా చింతించడం లేదు.. తన ఆటను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, అర్జెంటీనాను మరోసారి జగజ్జేతగా నిలపడమే తన ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పాడు. మెస్సీ రాసిన ఈ భావోద్వేగపూరిత మెసేజ్ అర్జెంటీనా శిబిరంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. స్పెయిన్‌తో జరగబోయే ఈ చారిత్రాత్మక ఫైనల్లో మెస్సీ సేన ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో అనేది వేచి చూడాలి మరీ.