FIFA World Cup Final: ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని అడ్డుకోవడం ఏ కోచ్‌కైనా ఒక పెద్ద పజిల్. కేవలం అసాధ్యమైన కోణాల నుంచి గోల్స్ చేయడమే కాకుండా, ప్రత్యర్థి డిఫెన్స్ కోటలను తన అద్భుతమైన పాసింగ్ విజన్‌తో బద్దలు కొట్టడం మెస్సీకి బాగా తెలుసు.. గత రెండు దశాబ్దాలుగా ఎందరో మేనేజర్లు దీని కోసం తలలు పట్టుకున్నారు. కానీ, 2014 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ మాజీ కోచ్ జోచిమ్ లోవ్ (Joachim Loew) అమలు చేసిన వ్యూహం.. మెస్సీని ఎలా న్యూట్రలైజ్ చేయాలో ఒక పక్కా బ్లూప్రింట్‌ను అందిస్తుంది. ఇప్పుడు 2026 ఫైనల్లో స్పెయిన్ జట్టు మెస్సీని కట్టడి చేయడానికి జర్మనీ ఫార్ములాను స్పెయిన్ అమలు చేసేందుకు రెడీ అయింది.
మ్యాన్-మార్కింగ్ వద్దు.. జోనల్ కేజ్ ముద్దు:
మెస్సీని ఆపడంలో చాలా జట్లు చేసే అతి పెద్ద పొరపాటు.. ఒకే ఆటగాడిని అతని వెనుక పంపడం (మ్యాన్-మార్కింగ్).. మెస్సీ చాలా తెలివైనవాడు కాబట్టి, ఆ మార్కర్‌ను తన వెంటే లాక్కెళ్లి డిఫెన్స్‌లో ఖాళీలను సృష్టిస్తాడు, దానిని ఇతర అర్జెంటీనా ప్లేయర్స్ ఉపయోగించుకుంటారు. అందుకే 2014లో జర్మనీ మ్యాన్-మార్కింగ్‌కు వెళ్లకుండా అతని చుట్టూ ఒక కదిలే జోనల్ కేజ్ (Zonal Cage) నిర్మించింది. మెస్సీ ఏ జోన్‌లోకి వస్తే ఆ జోన్‌లోని డిఫెండర్ వెంటనే అతన్ని చుట్టుముట్టేవాడు. ఒక రిలే రేసులో బ్యాటన్‌ను మార్చినట్లు, మెస్సీని ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ జర్మన్ ప్లేయర్లు అతని చుట్టూ రక్షణ గోడలా నిలిచి అడ్డుకున్నారు.
సప్లై లైన్‌ను కట్ చేసిన 2014 సెన్సేషన్:
మెస్సీ తన విశ్వరూపం చూపించాలంటే అతనికి నెంబర్ 10 పాకెట్ (మిడ్‌ఫీల్డ్ మరియు డిఫెన్స్ మధ్య ఖాళీ) లో బంతి దొరకాలి.. 2014 ఫైనల్లో జర్మన్ మిడ్‌ఫీల్డర్ బాస్టియన్ స్క్వీన్‌స్టైగర్ ఒక హ్యూమన్ షీల్డ్‌లా మారి మెస్సీకి బంతి అందకుండా సప్లై లైన్‌ను పూర్తిగా బ్రేక్ చేసేశాడు. మెస్సీకి బంతి అందిన ప్రతిసారీ భౌతికంగా (Physical battle) అడ్డుకుంటూ అతనికి అస్సలు స్వేచ్ఛ ఇవ్వలేదు. అలాగే, మెస్సీ తన బలమైన ఎడమ కాలితో లోపలికి రాకుండా (Cut inside) డిఫెండర్లు హమ్మెల్స్, హోవెడెస్ అతన్ని టచ్‌లైన్ వైపు నెట్టేశారు. దీంతో మెస్సీ తన కుడి కాలితో ఆడాల్సి రావడంతో.. మంచి షాట్లు కొట్టలేకపోయాడు.
2026 ఫైనల్లో రోడ్రి భుజాలపై గురుతర బాధ్యత:
ఇప్పుడు 2026 మహా సంగ్రామంలో స్పెయిన్ కెప్టెన్ రోడ్రి (Rodri) సరిగ్గా అదే పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్న రోడ్రి, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ల నుంచి మెస్సీకి వచ్చే పాస్‌లను ముందే పసిగట్టి అడ్డుకోవాల్సి ఉంటుంది. మెస్సీని కట్టడి చేయడానికి సరైన మార్గం ఏంటంటే.. అసలు అతని కాళ్లకి బంతి దొరకకుండా చేయడమే.. ఈ టోర్నీలో అత్యధిక పాస్‌లు పూర్తి చేసిన రికార్డు ఉన్న రోడ్రి, స్పెయిన్ మిడ్‌ఫీల్డ్‌ను తన ఆధీనంలో పెట్టుకుంటే మెస్సీ ప్రభావం దానంతట అదే తగ్గిపోనుంది. అర్జెంటీనా కౌంటర్ ఎటాక్స్‌ను ప్రారంభంలోనే అడ్డుకోవడంలో రోడ్రి వ్యూహాత్మక ఫౌల్స్, ఫిజికల్ టాకిల్స్ కీలకం కానున్నాయి.
అర్జెంటీనా మైండ్ గేమ్స్.. స్పెయిన్‌కు ఓర్పు ముఖ్యం:
స్పెయిన్ గనుక ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తే, మెస్సీ బంతి కోసం చాలా వెనక్కి (సొంత హాఫ్‌లోకి) వచ్చి ఆడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలాంటప్పుడు రోడ్రిని, స్పెయిన్ డిఫెండర్లను డైవర్ట్ చేయడానికి అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్ (Rodrigo De Paul), ఇతరులు భౌతిక ఘర్షణలకు (Physical confrontations) దిగి మైండ్ గేమ్స్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో స్పెయిన్ ఆటగాళ్లు తమ సంయమనాన్ని, ఓర్పును కోల్పోకుండా ఉంటే.. 2026 ప్రపంచకప్ ట్రోఫీని స్పెయిన్ అందుకోవడం ఖాయం.
The Final.#FIFAWorldCup pic.twitter.com/KJSsp49E39
— FIFA World Cup (@FIFAWorldCup) July 19, 2026
