మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ..బోటింగ్ సౌకర్యం ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ..బోటింగ్ సౌకర్యం ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
  • కృష్ణమ్మ ఒడిలో ఆహ్లాదకర ప్రయాణం.. రూ.13కోట్లు శాంక్షన్‌‌ 
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తొలి స్పిరిచువల్ టూరిజం సెంటర్
  • లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఆధ్యాతికం, పర్యాటకం   

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఇకపై ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచనుంది. ఇన్నాళ్లూ కేవలం దైవ దర్శనానికే పరిమితమైన ఈ పుణ్యక్షేత్రం, త్వరలోనే పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి చెందునుంది. మట్టపల్లిలో బోటింగ్ సౌకర్యం కోసం ప్రభుత్వం తాజాగా రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకోనుంది.


రూ.13కోట్లతో అభివృద్ధి పనులు 


కృష్ణా నదీ తీరాన వెలసిన ఈ స్వయంభూ క్షేత్రం ఎంతో ప్రాచీనమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కాగా దశాబ్దాలుగా ఇక్కడ స్వామివారి దర్శనం తప్ప భక్తులకు ఆహ్లాదాన్ని పంచే ఇతర వసతులు లేవు. మరోపక్క కొన్ని దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మట్టపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఆయన ఆదేశాలతో పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, తాజాగా రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు పాలనాపరమైన అనుమతులు లభించాయి.

ఉమ్మడి జిల్లాలోనే తొలి స్పిరిచువల్ టూరిజం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రం వద్ద బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. నాగార్జున సాగర్ వద్ద బోటింగ్ ఉన్నప్పటికీ, అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాలు లేవు. కానీ మట్టపల్లిలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు, వెంటనే కృష్ణమ్మ అలలపై బోటింగ్ చేస్తూ సేదదీరే అవకాశం కలుగుతుంది. అటు ఏపీ సరిహద్దులోనూ ఇటువంటి పర్యాటక ప్రాంతాలు లేకపోవడంతో, మట్టపల్లికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో యాదాద్రి తర్వాత అంతటి మహిమ గల క్షేత్రంగా మట్టపల్లికి పేరుంది. ప్రస్తుతం హుజూర్‌‌నగర్ నుంచి మట్టపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 ఇది పూర్తయితే మట్టపల్లికి రవాణా సౌకర్యం మరింత పెరగనుంది.