నా భర్త ఐపీఎస్‌ అయ్యాక డైవర్స్ అడుగుతుండు..నా కూతుర్ని చూడనివ్వట్లేదు..బీహార్ ఎస్పీ భార్య ఆరోపణలు

నా భర్త ఐపీఎస్‌ అయ్యాక  డైవర్స్ అడుగుతుండు..నా కూతుర్ని చూడనివ్వట్లేదు..బీహార్ ఎస్పీ భార్య ఆరోపణలు

బిహార్‌లోని ఖగారియా ఎస్పీ, 2021 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి భానుప్రతాప్‌ సింగ్‌ కుటుంబ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య పూజా కుమారి.. భర్త, అత్తింటివారు తన ఆరేళ్ల కుమార్తెను తనకు దూరం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఆమె పలు ఆరోపణలు చేశారు. 

ఐపీఎస్‌ అయ్యాకే సంబంధాలు మారిపోయాయి

భానుప్రతాప్‌ సింగ్‌తో తన సంబంధం ఆయన ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత మారిపోయిందని పూజ ఆరోపించారు. ఐపీఎస్‌ అయిన తర్వాత తన భర్త విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నారని ఆమె వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా తన కుమార్తెను కలవకుండా, మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పూజ చేసిన ఆరోపణలను భానుప్రతాప్‌ సింగ్‌ అంగీకరించలేదు. 

భరత్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరిన వివాదం

భానుప్రతాప్‌ కుటుంబం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉండటంతో వివాదం అక్కడికి చేరింది. తన భర్త కుమార్తెతో కలిసి భరత్‌పూర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పూజ.. బిహార్‌ నుంచి ముందుగా అత్తింటికి వెళ్లగా సుమారు గంటపాటు వేచి చూసినా తలుపులు తీయలేదని ఆమె ఆరోపించారు. అనంతరం విజయ్‌నగర్‌లోని తన ఆడపడుచు ఇంటికి వెళ్లినా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. దీంతో ఆమె భరత్‌పూర్‌లోని మథురా గేట్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి తన కుమార్తెను కలిసేందుకు సహాయం చేయాలని కోరారు. పూజ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పోలీసులు భానుప్రతాప్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఆమె కొన్ని గంటలపాటు పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. 

►ALSO READ | గుడ్ న్యూస్.. టీబీ అంతానికి కొత్త వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయ్.. కోట్లాదిమంది ప్రాణాలకు రక్షణ!

2015లో పరిచయం.. ఆ తర్వాత ప్రేమ వివాహం

పూజ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు, భానుప్రతాప్‌ సింగ్‌కు 2015లో ఓ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యులను ఎదురించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత పూజ భరత్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు.

భానుప్రతాప్‌ సింగ్‌ యూపీఎస్సీకి సిద్ధమవుతున్న సమయంలో తాను కుటుంబానికి అండగా నిలిచానని పూజ చెబుతున్నారు. ఆయన ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత తమ దాంపత్య జీవితంలో విభేదాలు మొదలయ్యాయని ఆమె ఆరోపిస్తున్నారు. భానుప్రతాప్‌ సింగ్‌ బిహార్‌ క్యాడర్‌కు చెందిన 2021 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఖగారియా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అంతకుముందు ముజఫర్‌పూర్‌, దానాపూర్‌లో ఏఎస్పీగా సేవలందించారు.