తమిళనాడు రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో తమిళ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని విజయ్ రెండు సార్లు కలిసి విజ్ఞప్తి చేసినా గవర్నర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. 118 ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే అనుమతిస్తానని గవర్నర్ చెప్పడంతో విజయ్ పార్టీ సందిగ్ధంలో పడింది. గవర్నర్ నిర్ణయానికి నిరసనగా ఇవాళ జిల్లా కేంద్రాల్లో టీవీకే నిరసన తెలుపుతోంది.
ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ రాజకీయాల్లో బద్ద శత్రువులైన డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తెర వెనుకు వ్యూహ రచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకేను కాదని..డీఎంకే,అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే .. విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేలతో సామూహిక రాజీనామాలు చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంఖ్యాబలం లేకపోయినా డీఎంకే లేదా ఏఐఏడీఎంకేలు అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే.. ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాలని టీవీకే భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. విజయ్ రెండు చోట్లా గెలవడంతో, ఒక సీటుకు రాజీనామా చేయగా.. ప్రస్తుతం పార్టీ బలం 107గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి మొత్తం 112 మంది సభ్యులు విజయ్ వెంటే ఉన్నారు. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118ని చేరుకోవడానికి మరో ఆరుగురి మద్దతు అవసరం.ఈ తరుణంలో, విజయ్ ని అధికారానికి దూరం చేసేందుకు చిరకాల ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు రహస్యంగా ఏకమవుతున్నాయనే వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీఎంకే 59, ఏఐఏడీఎంకే 47 సీట్లు సాధించినప్పటికీ.. టీవీకేను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు ద్రావిడ పార్టీలు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
దీనిపై టీవీకే శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.ప్రజా తీర్పు స్పష్టంగా ఉంది.. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు మిత్రపక్షాల మద్దతు కోసం చర్చలు సాగిస్తూనే, మరోవైపు రాజీనామాల అస్త్రాన్ని సిద్ధం చేసుకోవడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గానీ లేదా ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే, తమిళగ వెట్రి కజగం (టీవీకే) తన 107 మంది ఎమ్మెల్యేలందరితో సామూహిక రాజీనామాలను పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు ప్రజా తీర్పు స్పష్టంగా ఇవ్వలేదు కానీ అతిపెద్ద పార్టీని విస్మరించలేము అని ఆ వర్గంలోనిఓ సీనియర్ టీవీకే నాయకుడు అన్నారు.
