ఇంట్లో పాత వస్తువుల రిపేర్ పిసినిగొట్టుతనం కాదు.. నాన్నల అలవాటు వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే

ఇంట్లో పాత వస్తువుల రిపేర్ పిసినిగొట్టుతనం కాదు.. నాన్నల అలవాటు వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే

ఇంట్లో డైనింగ్ టేబుల్ కుర్చీ ఊగుతున్నా, టీవీ రిమోట్ సరిగ్గా పనిచేయకపోయినా, ఫ్యాన్ కిర్రు కిర్రుమంటూ శబ్దాలు చేస్తున్నా.. చాలా మంది నాన్నలు వెంటనే కొత్తవి కొనడానికి ఇష్టపడరు. చేతిలోకి స్క్రూడ్రైవర్ తీసుకుని ఆ వస్తువును విప్పి, గంటల తరబడి కూర్చుని బాగు చేయడానికి ట్రై చేస్తారు. ఇది చూసి నేటి తరం పిల్లలు ఎందుకు నాన్న అంత టైమ్ వేస్ట్ చేస్తావ్? ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో కొత్తది వస్తుందిగా.. ఎందుకీ పిసినిగొట్టుతనం? అని విసుక్కుంటారు. 

నాన్నలు అలా చేయడం వెనుక ఉన్నది కక్కుర్తి కాదు.. అదొక అద్భుతమైన సైకాలజీ. అవును వస్తువులను రిపేర్ చేయడం అనేది నాన్నల దృష్టిలో కేవలం ఒక పని కాదు.. ప్రేమను వ్యక్తపరచటానికి అదొక మార్గం అంట. పాత వస్తువులతో వారికి ఉన్న అటాచ్మెంట్ గురించి ఇది సూచిస్తోంది.

నాన్నల బాధ్యత - ఐడెంటిటీ థియరీ:
సైకాలజీలో ఐడెంటిటీ థియరీ ప్రకారం.. మనుషులు తమ జీవితాన్ని కొన్ని బాధ్యతాయుతమైన పాత్రల చుట్టూ నిర్మించుకుంటారు. ఫ్యామిలీలో నాన్న పాత్ర ఎప్పుడూ రక్షకుడు, సమస్యలను పరిష్కరించేవాడు గానే ఉంటుంది. వయసు పైబడుతున్న కొద్దీ.. ఇంట్లో విరిగిన వస్తువును బాగు చేయడం ద్వారా నాన్న మెదడు తనకు తానుగా ఒక భరోసా ఇచ్చుకుంటుంది. "నేను ఇంకా కుటుంబానికి ఉపయోగపడుతున్నాను.. నేను ఇప్పటికీ సమస్యలను పరిష్కరించగలను" అనే ఒక మానసిక తృప్తి తండ్రులకు ఆ పని ద్వారా లభిస్తుందట.

చిన్న వస్తువు వెనుక జ్ఞాపకాలు:
సైకాలజిస్ట్‌లు ఎడ్వర్డ్ డెసి, రిచర్డ్ ర్యాన్ ప్రతిపాదించిన ‘సెల్ఫ్-డిటర్మినేషన్ థియరీ’ ప్రకారం.. మనుషులకు సామర్థ్యం, స్వేచ్ఛ, బంధాలు చాలా అవసరం. నాన్న ఒక వస్తువును రిపేర్ చేసినప్పుడు ఈ మూడు అవసరాలు తీరుతాయి. అలాగే ఎండౌమెంట్ ఎఫెక్ట్ ప్రకారం.. నాన్నలకు తాము వాడుతున్న పాత వస్తువులపై విపరీతమైన మక్కువ ఉంటుందట. ఇంట్లోని డైనింగ్ కుర్చీ కేవలం ఫర్నిచర్ కాదు.. దానిపై కూర్చుని కుటుంబంతో కలిసి తిన్న ఎన్నో ఏళ్ల జ్ఞాపకం. ఆ పాత గడియారం నాన్నకు వాళ్ల నాన్నను గుర్తు చేయవచ్చు. అందుకే ఆ వస్తువును పారేయడం అంటే.. తమ ఫ్యామిలీ హిస్టరీలోని ఒక జ్ఞాపకాన్ని పారేసినట్టుగా వారు భావిస్తారు. అయితే పాడైన వస్తువును రిపేర్ చేయడం ద్వారా వారు ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకుంటారు.

మాటల్లో చెప్పలేని ప్రేమ.. చేతల్లో చూపిస్తూ:
కొంతమంది నాన్నలు తమ ప్రేమను ముఖం మీదే "ఐ లవ్ యూ" అని మాటల్లో చెప్పలేరు. అలాంటి వారు ఇన్‌స్ట్రుమెంటల్ సపోర్ట్ థియరీని ఫాలో అవుతారట. అంటే.. మాటల కంటే చేతల్లో ప్రేమను చూపిస్తారు. పిల్లల సైకిల్ బాగు చేయడం, పాడైన బెడ్‌రూమ్ డోర్ హ్యాండిల్ సరిచేయడం, వంటింట్లో ఏదైనా అప్లయన్స్ పాడైతే ఎవరూ అడగకుండానే దాన్ని రిపేర్ చేయడం.. ఇవన్నీ నాన్నలు సైలెంట్‌గా చెప్పే ప్రేమ కవితలే. "మీకు ఏ కష్టం వచ్చినా, నేను దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పడమే ఆ రిపేర్ల వెనుక ఉన్న అసలు సారాంశం అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

స్ట్రెస్ రిలీఫ్.. జనరేషన్ గ్యాప్:
ఇవాల్టి యూజ్ అండ్ త్రో కల్చర్‌లో హెడ్‌ఫోన్స్ పాడైతే వెంటనే మార్చేస్తాం. ఫోన్‌ను రెండేళ్లకోసారి అప్‌గ్రేడ్ చేస్తాం. కానీ నాన్నల తరం వస్తువు మన్నికకు ప్రాధాన్యత ఇచ్చింది. ‘ఫ్లో థియరీ’ ప్రకారం.. నాన్నలు ఆ గ్యారేజ్ రూమ్‌లోనో, టూల్‌బాక్స్ ముందో కూర్చుని వస్తువులను బాగు చేస్తున్నప్పుడు.. వారి దృష్టంతా ఆ పనిపైనే ఉంటుంది. అది వారి రోజువారీ మానసిక ఒత్తిడిని తగ్గించి.. ఒక ప్రశాంతతను ఇస్తుందట.

సో ఇంకెప్పుడైనా నాన్న ఇంట్లోని పాత వస్తువును పట్టుకుని రిపేర్ చేస్తుంటే.. ఆయన్ని పిసినిగొట్టు అని హేళన చేయకండి. ఎందుకంటే నాన్న అక్కడ పాడైన వస్తువును మాత్రమే కాదు.. కుటుంబంతో తనకున్న బంధాన్ని, బాధ్యతను కూడా రిపేర్ చేసుకుంటున్నారని గుర్తించండి.