న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్ రీ ఎంట్రీపై టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తద్వారా తన టెస్ట్ క్రికెట్ పునరాగమనంపై వస్తోన్న ఊహాగానాలకు కోహ్లీ తెరదించారు.
ఆదివారం (జూన్ 21) న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో వన్8 గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కోహ్లీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్ట్ క్రికెట్ రీ ఎంట్రీపై కోహ్లీకి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. టెస్ట్ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఆ ఫార్మాట్‌తో ప్రయాణం ముగిసిందని.. ఇక చాలు ధన్యవాదాలు అని రీ ఎంట్రీ పుకార్లకు చెక్ పెట్టారు.
కోహ్లీ ప్రకటనతో గత కొన్ని రోజులుగా అతడి టెస్ట్ క్రికెట్ పునరాగమనంపై వస్తున్న అన్ని ఊహాగానాలకు తెరపడింది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2025, మేలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే, కోహ్లీ మంచి ఫిట్నెస్, ఫామ్‌లో ఉండటంతో అతడు తిరిగి టెస్ట్ క్రికెట్ ఆడాలని అతడి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
►ALSO READ | సౌతాఫ్రికాతో కీలక పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్
పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కోహ్లీ టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పునరాగమనంపై వస్తున్న వార్తలను కోహ్లీ పూర్తిగా కొట్టిపారేశారు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగానని.. టెస్ట్ ఫార్మాట్‌లో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు.
కోహ్లీ టెస్ట్ కెరీర్:
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్ట్ క్రికెట్ అరంగ్రేటం చేశాడు. 2025, మే నెలలో వైట్ బాల్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. తన కెరీర్‌లో మొత్తం 123 టెస్ట్ మ్యాచులు ఆడిన కింగ్ కోహ్లీ 9,230 పరుగులు చేశారు. మహేంద్ర సింగ్ ధోని నుంచి 2015లో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
కోహ్లీ కెప్టెన్సీలో భారత టెస్ట్ జట్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో ఏండ్ల తర్వాత టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు.. ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్ లో టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకరిగా కోహ్లీ పేరు సంపాదించుకున్నారు.
