హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా..వారం రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా..వారం రోజులు భారీ వర్షాలు
  • హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా వానలు.. ఎల్లో అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ
  • 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇక వర్షాలు ఊపందుకోనున్నాయి. వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, టెంపరేచర్లు 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు స్తంభించిపోయినా.. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, చత్తీస్‌‌‌‌గఢ్​ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావాలతో వర్షాలు పడుతాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. 

హైదరాబాద్ సిటీ పరిధిలోనూ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కాగా, అదే సమయంలో సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఆదివారం టెంపరేచర్లు కొంత ఉపశమించాయి. కేవలం 10 జిల్లాల్లోనే 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. 

మరో నాలుగు జిల్లాల్లో 35 డిగ్రీలకన్నా తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల జిల్లా రాఘవపేటలో 42.8, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 42.7, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 42, మంచిర్యాల జిల్లా భీమినిలో 41.9, నిర్మల్ జిల్లా కుంటాలలో 41.5, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 41.5, కరీంనగర్ జిల్లా వెదురుగట్టులో 40.7, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 40.5, జయశంకర్​భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 40.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

అత్యల్పంగా మేడ్చల్​ మల్కాజ్‌‌గిరి జిల్లా ఉప్పల్​లో 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ 34 డిగ్రీల రేంజ్​లోనే టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇటు జీహెజ్‌‌ఎంసీ, మల్కాజ్‌‌గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 60 సర్కిళ్లలోనూ 35 డిగ్రీలు.. ఆలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్బీనగర్, హయత్‌‌నగర్, ఆదిబట్ల, మలక్‌‌పేట, ఖైరతాబాద్, అంబర్‌‌‌‌పేట పరిధిలలో మాత్రమే 35 డిగ్రీల రేంజ్‌‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్​కు ​అలర్ట్​

సోమవారం నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్ సిటీలోనూ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ఐఎండీ తాజా అలర్ట్స్‌‌లో హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలోని అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో కొంచెం అలసత్వం వహించినా మునుపటి తిప్పలు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కొద్ది రోజుల కింద కురిసిన చిన్న వర్షానికే సిటీలోని రోడ్లు ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన సంగతి తెలిసిందే. విధుల్లో అధికారులు అలసత్వం వహించడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులపై సీరియస్​అవడంతోపాటు ఇకపై ఇలాంటివి జరగొద్దని గట్టిగా హెచ్చరించారు. 

మరోవైపు ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా లోనవెల్లిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా ఎక్లాస్‌‌పూర్‌‌‌‌లో 3.1, ముత్తారంలో 2.9, జగిత్యాల జిల్లా జగిత్యాలలో 2.7, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 2.6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.