29 బంతుల్లో 94 రన్స్ కొట్టిన వైభవ్.. శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ గెలిచిన భారత్ ఏ

29 బంతుల్లో 94 రన్స్ కొట్టిన వైభవ్.. శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ గెలిచిన భారత్ ఏ

India A vs Sri Lanka A Tri-Nation Series: ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో భారత్ ఏ జట్టు అద్భుతమైన పర్ఫామెన్స్‌తో శ్రీలంక– ఏ పై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా–ఏ 50 ఓవర్లలో 377/9 పరుగుల భారీ టార్గెట్ ని లంక ముందు పెట్టింది. అనంతరం 378 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక–ఏ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 47.1 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక జట్టులో అనుభవజ్ఞుడైన బ్యాటర్ సదీర సమరవిక్రమ (52), ఆల్ రౌండర్ వనుజ సహాన్ (62) హాఫ్ సెంచరీలతో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ లంకకు ఓటమి తప్పలేదు.

11 బంతుల్లోనే 15 ఏళ్ల కుర్రాడు రికార్డు హాఫ్ సెంచరీ: 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్– ఏ జట్టుకు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్ళు చెదిరే స్టార్టింగ్ ఇచ్చాడు. లంక బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. కేవలం 11 బంతుల్లోనే లిస్ట్ – ఏ క్రికెట్ హిస్టరీలోనే రికార్డు స్థాయి హాఫ్ సెంచరీ బాదాడు. కేవలం 29 బంతులు ఆడిన ఈ వండర్ కిడ్.. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 రన్స్ చేసి సెంచరీ మిస్ అయినప్పటికీ ఇండియాకు ఒక పటిష్టమైన పునాది వేశాడు.

►ALSO READ | 90 నిమిషాల్లో 15 సేవ్స్.. గోల్‌పోస్ట్ ముందు గోడలా నిలిచిన ఎలోయ్.. కురసావో- ఈక్వెడార్‌ మ్యాచ్ డ్రా!

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తిలక్.. ఆఖర్లో అనుకుల్ మెరుపులు: 
ఒకవైపు వైభవ్ సూర్యవంశీ విద్వంసం సృష్టించినా.. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతను కెప్టెన్ తిలక్ వర్మ తీసుకున్నాడు. తిలక్ 90 బంతుల్లో 67 పరుగులతో ఎంతో నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగా, అతడికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (40 పరుగులు) తన వంతు సాయం చేశాడు. ఇక ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లోనే 39 రన్స్‌తో నెక్స్ట్ లెవెల్ మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.

లంక పతనాన్ని శాసించిన భారత బౌలర్లు:  
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసి దెబ్బకొట్టారు. పేసర్ యశ్ ఠాకూర్ 3 వికెట్లతో లంక టాప్ ఆర్డర్‌ను వణికించగా.. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ కూడా 3 వికెట్లతో చెలరేగి శ్రీలంక జట్టు పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్‌లో మెరిసిన అనుకుల్ రాయ్ బౌలింగ్‌లోనూ 2 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.