టెస్ట్ కు ముందు టీమిండియాలో జోష్... శ్రీలంకతో వార్మప్ మ్యాచ్.. జైస్వాల్‌‌ మెరుపు హాఫ్‌‌ సెంచరీ.. గిల్‌‌కు మంచి ప్రాక్టీస్‌‌..

టెస్ట్ కు ముందు టీమిండియాలో జోష్... శ్రీలంకతో వార్మప్ మ్యాచ్.. జైస్వాల్‌‌ మెరుపు హాఫ్‌‌ సెంచరీ.. గిల్‌‌కు మంచి ప్రాక్టీస్‌‌..
  • జైస్వాల్‌‌ మెరుపు హాఫ్‌‌ సెంచరీ.. గిల్‌‌కు మంచి ప్రాక్టీస్‌‌
  • చివర్లో సిరాజ్‌‌ సిక్సర్ల మోత.. 207 టార్గెట్‌‌ ఛేదించిన టీమిండియా

కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌కు ముందు టీమిండియా వార్మప్‌‌  మ్యాచ్‌‌లో అదరగొట్టింది. శ్రీలంక క్రికెట్‌‌ ఎలెవన్‌‌తో జరిగిన మూడు రోజుల వార్మప్‌‌ మ్యాచ్‌‌లో భారత్‌‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌‌ 45 ఓవర్లలో 214/4 స్కోర్​ చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్‌‌ (61–46 బంతుల్లో) మెరుపు హాఫ్‌‌ సెంచరీతో రాణించగా.. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ 44 పరుగులు చేశాడు. 

చివర్లో మహమ్మద్‌‌ సిరాజ్‌‌ 15 బంతుల్లోనే అజేయంగా 32 పరుగులు చేసి మ్యాచ్‌‌ను ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌‌లో డకౌటైన జైస్వాల్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో దూకుడుగా ఆడాడు. గిల్‌‌తో కలిసి తొలి వికెట్‌‌కు 105 పరుగులు జోడించాడు.  వేలి గాయం కారణంగా తొలి రెండు రోజులు ఆడని గిల్‌‌.. తిరిగి బ్యాటింగ్‌‌కు దిగి 44 పరుగులు చేయడం భారత్‌‌కు ఊరటనిచ్చింది. ధ్రువ్‌‌ జురెల్‌‌ 17, రిషభ్‌‌ పంత్‌‌ 28 పరుగులు చేశారు. 

చివర్లో సిరాజ్‌‌ వరుసగా మూడు సిక్సర్లు బాది విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు శ్రీలంక ఎలెవన్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌ను 200/6 వద్ద డిక్లేర్‌‌ చేసింది. నిషాన్‌‌ మధుష్క 63, నిపున్‌‌ ధనంజయ 46, అంజలా బండారా 35 పరుగులు చేశారు. భారత్‌‌ తరఫున రవీంద్ర జడేజా, గుర్నూర్‌‌ బ్రార్‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌‌, ప్రసిద్ధ్‌‌ కృష్ణ చెరో వికెట్‌‌ తీశారు.

పడిక్కల్ అజేయ శతకం

శ్రీలంక ఎలెవన్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను 363/8 వద్ద డిక్లేర్‌‌ చేయగా.. భారత్‌‌ 357/6 వద్ద  తొలిఇన్నింగ్స్‌‌ను డిక్లేర్‌‌ చేసింది.  దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్)  సెంచరీతో సత్తా చాటాడు.  రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ధ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.  

లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.  దీనికిముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్​లో  8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్థ సెంచరీలతో రాణించారు. 

భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ నెల 15న గాలెలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు పడిక్కల్‌‌ సెంచరీ, జైస్వాల్‌‌ హాఫ్‌‌ సెంచరీ, గిల్‌‌ రీఎంట్రీ భారత్‌‌కు ప్రధాన సానుకూలాంశాలుగా నిలిచాయి.