డీసీ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గా గంగూలీ

డీసీ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గా గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ.. ఐపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ జట్టు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా నియమితుడయ్యాడు. ప్రస్తుత కోచ్‌‌‌‌ హేమంగ్‌‌‌‌ బదానీ స్థానంలో దాదా ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. గత రెండు సీజన్లలో డీసీ ప్లే ఆఫ్స్‌‌‌‌ చేరడంలో విఫలం కావడం ఈ మార్పుకు కారణమైంది. దాంతో 2027 సీజన్‌‌‌‌లో గంగూలీ ఆధ్వర్యంలో డీసీ ముందుకెళ్లనుంది. 2019లో ఢిల్లీ ఫ్రాంచైజీలో సలహాదారుగా ప్రయాణం మొదలుపెట్టిన గంగూలీ.. మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ జట్లకు డైరెక్టర్ ఆఫ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌గా సేవలందించాడు. గతేడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌‌‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌‌‌‌కు హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గానూ వ్యవహరించాడు. 

‘ఐపీఎల్‌‌‌‌లో హెడ్ కోచ్ పాత్రను చేపట్టడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ నాకు చాలా ఇష్టమైన ఫ్రాంచైజీ. దానితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ బాధ్యత ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఫ్రాంచైజీ యజమానులు, ప్లేయర్లతో కలిసి బలమైన, నిర్భయమైన జట్టును నిర్మిస్తాం’ అని గంగూలీ పేర్కొన్నాడు. మరోవైపు లక్నోతో జరిగిన హైప్రొఫైల్‌‌‌‌ ప్లేయర్ల ట్రేడ్‌‌‌‌లో భాగంగా చైనామన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌కు వెళ్లగా రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ మళ్లీ ఢిల్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు.