దేశంలో డిజిటల్ పేమెంట్లను పూర్తిగా మార్చేసిన UPI వ్యవస్థపై కొత్తగా ప్రతిపాదిత మార్పులు వినియోగదారుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రూ.2వేల కంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించే వారికి ఇకపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా అనే సందేహం నెలకొంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాధారణ వినియోగదారులు నేరుగా ఈ ఛార్జీల భారం మోయాల్సిన పరిస్థితి లేదని తెలుస్తోంది.
ప్రతిపాదనలో కీలకంగా ఉన్నది మర్చంట్ ఛార్జీలు(MDR). రూ.2వేల కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు MDR విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఛార్జీని UPI వినియోగదారుడి నుంచి నేరుగా వసూలు చేయడం కాకుండా.. నిర్దిష్ట అర్హత కలిగిన పెద్ద వ్యాపారులపై విధించే ప్రతిపాదనగా చెబుతున్నారు.
అంటే మీరు ఒక పెద్ద షాపింగ్ స్టోర్‌లో రూ.5వేలు విలువైన వస్తువులు కొనుగోలు చేసి UPI ద్వారా చెల్లించినంత మాత్రాన మీ బ్యాంక్ ఖాతా నుంచి అదనంగా MDR పేరుతో డబ్బు కట్ అవుతుందని అర్థం కాదు. ఇక్కడ ఛార్జీ వ్యాపారి వైపు పడుతుంది. అందువల్ల రూ.2వేలు దాటిన ప్రతి UPI పేమెంట్‌కు కస్టమర్‌కు నేరుగా ఛార్జీ పడుతుందనే ప్రచారం ప్రస్తుతానికి నిజం కాదు. అయితే వ్యాపారులు అంతిమంగా ఈ ఛార్జీలను వస్తువు రేటులో కలిపి కస్టమర్ల నుంచే వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ ప్రతిపాదన అన్ని వ్యాపారులకు వర్తించదు. ఏడాదికి రూ.కోటిన్నర పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులపై మాత్రమే MDR వర్తించేలా ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. రూ.కోటిన్నర కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు ఈ ప్రతిపాదిత ఛార్జీల పరిధిలోకి రారు. లావాదేవీ విలువ రూ.2వేలు దాటినా చిన్న వ్యాపారులపై ఈ MDR వర్తించదని చెబుతున్నారు.
ఇక ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే UPI ట్రాన్సాక్షన్ల విషయంలోనూ వినియోగదారులకు ఊరటే కనిపిస్తోంది. వ్యక్తి నుంచి వ్యక్తి మధ్య జరిగే UPI ట్రాన్స్‌ఫర్లపై కూడా ఈ ప్రతిపాదిత MDR వర్తించదని సమాచారం. అంటే స్నేహితుడికి రూ.5వేలు పంపినా, కుటుంబ సభ్యుడికి రూ.10వేలు పంపినా ఈ ప్రతిపాదన కారణంగా వినియోగదారుడిపై నేరుగా ఛార్జీ పడే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.
అయితే రూ.2వేలు కంటే ఎక్కువ మొత్తంలో UPI చెల్లింపులు చేసే వారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా ఉంది. కారణం, పెద్ద వ్యాపారులపై MDR విధించిన తర్వాత కొందరు వ్యాపారులు ఆ ఖర్చును ఇతర మార్గాల్లో వినియోగదారులపైకి మళ్లించే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే అలా చేయడానికి UPI పేమెంట్ చేసిన కస్టమర్‌కే నేరుగా MDR వసూలు చేయడం వేరే విషయం. ప్రస్తుతం ప్రతిపాదనలో వినియోగదారులపై నేరుగా ఛార్జీ విధించే అంశం లేదని చెబుతున్నారు.
►ALSO READ | కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం నమ్మే ఈ అపోహలు పూర్తిగా అబద్ధం.. నిజం ఏంటంటే !
ఇక రూ.2వేలు పరిమితి గురించి కూడా వినియోగదారులు స్పష్టత తెలుసుకోవాల్సి ఉంది. ఇది 'రూ.2వేలు దాటితే ప్రతి ఒక్కరి UPIకి ఛార్జీ' అనే నిబంధనగా చూడకూడదు. ప్రధానంగా అధిక విలువైన లావాదేవీలు చేసే పెద్ద వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని MDR తీసుకురావాలనే ప్రతిపాదనగా దీనిని చూడాలి. అందువల్ల రోజువారీగా కూరగాయలు, కిరాణా, బిల్లులు, చిన్న కొనుగోళ్లకు UPI ఉపయోగించే చాలా మందిపై దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.
UPI వ్యవస్థను నిర్వహించడానికి, దాని మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి నిరంతరం ఖర్చు అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం UPI లావాదేవీలకు సంబంధించిన ఖర్చులను వివిధ మార్గాల్లో భరించే విధానం కొనసాగుతోంది. దీర్ఘకాలంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద వ్యాపారులపై MDR విధించే ఆలోచన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
అందుకే రూ.2వేలకు పైన UPI పేమెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఇకపై ఛార్జీ చెల్లించాల్సిందేనని భావించాల్సిన అవసరం లేదు. ప్రతిపాదిత విధానం అమల్లోకి వచ్చినా, దాని ప్రభావం ప్రధానంగా రూ.2వేల కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు స్వీకరించే అర్హత కలిగిన పెద్ద వ్యాపారులపైనే ఉండనుంది. వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు, అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే UPI బదిలీలకు మాత్రం UPI ఉచితంగానే కొనసాగుతుందని ప్రతిపాదన చెబుతోంది.
అయితే ఇది ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని, అధికారికంగా నిబంధనలు ప్రకటించిన తర్వాతే ఎవరి మీద ఎంత ఛార్జీ, ఏ లావాదేవీలకు వర్తిస్తుంది అనే విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది. అప్పటివరకు 'రూ.2వేలు దాటితే UPIకి ఛార్జీ' అనే మాటను అందరికీ వర్తించే కొత్త నిబంధనగా భావించడం మాత్రం తప్పుదారి పట్టించే విషయమే.
