గోల్డ్, సిల్వర్‌పై టాక్స్ పెంపుతో మోడీ సర్కార్ 3 నెలల్లో ఎంత సంపాదించిందంటే..?

గోల్డ్, సిల్వర్‌పై  టాక్స్ పెంపుతో మోడీ సర్కార్ 3 నెలల్లో ఎంత సంపాదించిందంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పన్ను పెంపు నిర్ణయం ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో ఈ ఏడాది మే 13 నుంచి బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై దిగుమతి సుంకాలను పెంచిన కేంద్రం.. కేవలం రెండున్నర నెలల్లోనే దాదాపు రూ.10వేల 500 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ఈ విషయాన్ని సోమవారం లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

మే 13 నుంచి ఆగస్టు 2 వరకు పెంచిన దిగుమతి సుంకాల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగం బంగారం నుంచే వచ్చింది. ఈ కాలంలో బంగారం దిగుమతులపై పెంచిన సుంకాల ద్వారా ఏకంగా రూ.10వేల 040 కోట్లు కేంద్ర ఖజానాకు చేరాయి. వెండి దిగుమతులపై మరో రూ.328 కోట్లు, ప్లాటినంపై రూ.95 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తంగా ఈ మూడు విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాల ద్వారా రూ.10వేల 463 కోట్లు ప్రభుత్వానికి లభించాయి.

ఎందుకు దిగుమతి సుంకాలు పెంచారు?
ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్‌పై దిగుమతి భారం పెరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై సమర్థవంతమైన కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ప్రధాన ఉద్దేశం విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడమే, కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించడం, భారీగా పెరుగుతున్న దిగుమతి బిల్లును అదుపులో ఉంచడం.

వెండి దిగుమతులపై మరింత కఠినం..
దిగుమతులను నియంత్రించేందుకు డీజీఎఫ్‌టీ కూడా పలు చర్యలు తీసుకుంది. వెండిని ‘రిస్ట్రిక్టెడ్’ కేటగిరీలోకి మార్చడంతో ఇకపై దిగుమతిదారులు ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద డ్యూటీ-ఫ్రీగా దిగుమతి చేసుకునే బంగారాన్ని ఒక్కో లైసెన్స్‌కు 100 కిలోలకే పరిమితం చేశారు.

ALSO READ : వీళ్లిద్దరిలో ఎవరు ఆనందంగా ఉంటారు

అయితే ఈ పెరిగిన సుంకాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. 2026 ఏప్రిల్-జూన్ మధ్య భారత్‌లో బంగారం డిమాండ్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం తగ్గి 131.4 టన్నులకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అధిక దిగుమతి సుంకాలతో పాటు సీజనల్‌గా అమ్మకాలు బలహీనంగా ఉండటం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. అంటే ఒకవైపు దిగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ మారకంపై ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుండగా, మరోవైపు పెరిగిన సుంకాలు కేంద్ర ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ విధానం దిగుమతులు, బంగారం డిమాండ్, ధరలు, దేశీయ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారింది.