పిల్లలకు మాండరిన్ భాష నేర్పిస్తున్న ప్రపంచ కుబేరులు.. ఎందుకో తెలుసా?

పిల్లలకు మాండరిన్ భాష నేర్పిస్తున్న ప్రపంచ కుబేరులు.. ఎందుకో తెలుసా?

వేగంగా ఏఐ అభివృద్ధి చెందుతున్న కాలంలో పిల్లలకు కోడింగ్, ప్రోగ్రామింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు నేర్పించడమే భవిష్యత్తుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే ప్రపంచంలోని అత్యంత సంపన్న ఫ్యామిలీస్ మాత్రం మరో నైపుణ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా–స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ట్రంప్ కుటుంబానికి చెందిన వారు తమ పిల్లలకు మాండరిన్ నేర్పించడంపై ఆసక్తి చూపుతున్నారు. 

అసలు దీనికి కారణమేంటి?
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష. మాండరిన్ చైనీస్ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో అగ్రస్థానంలో ఉంది. దాదాపు 100 కోట్ల మంది దీనిని మాతృభాషగా మాట్లాడుతుండగా.. రెండో భాషగా మాట్లాడేవారిని కలిపితే మొత్తం మాట్లాడేవారి సంఖ్య సుమారు 118 కోట్లకు చేరుతుంది. చైనా ప్రపంచ తయారీ, వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, ఆవిష్కరణల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మాండరిన్ పరిజ్ఞానం భవిష్యత్తులో కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుందని వారు భావిస్తున్నారు.

జుకర్‌బర్గ్ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచే
మార్క్ జుకర్‌బర్గ్‌కు మాండరిన్‌పై ఆసక్తి చాలాకాలంగా ఉంది. 2010లో ఆయన ఈ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. తన భార్య ప్రిసిల్లా చాన్ కుటుంబంతో మాట్లాడేందుకు కూడా ఇది ఉపయోగపడింది. 2014లో బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీలో దాదాపు పూర్తిగా మాండరిన్‌లో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అదే ఆసక్తిని తన కుమార్తెలకు కూడా అందిస్తూ.. భాషతో పాటు చైనా సంస్కృతిని అర్థం చేసుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : హర్ ఘర్ తిరంగాలో పాల్గొనండి.. జాతీయ జెండా దేశ ప్రజలందరికీ గర్వకారణం

మస్క్, బెజోస్ కూడా అదే దారిలో..
ఎలాన్ మస్క్ తన కుమారుడికి మాండరిన్ నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. టెస్లాకు చైనా కీలక మార్కెట్ కావడం కూడా ఈ ఆసక్తికి నేపథ్యంగా కనిపిస్తుంది. మరోవైపు జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ తమ పిల్లలకు వివిధ ప్రపంచస్థాయి విద్యా అనుభవాలతో పాటు మాండరిన్ పాఠాలు, సింగపూర్ మ్యాథ్ వంటి విద్యా విధానాలను పరిచయం చేసినట్లు సమాచారం.

ట్రంప్ ఫ్యామిలీ కూడా..
ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్ కుమార్తె అరబెల్లా కుష్నర్ చిన్న వయసులోనే మాండరిన్ నేర్చుకోవడం ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. 2017లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఆమె మాండరిన్‌లో పలకరించి, చైనీస్ పాట, పద్యాన్ని ప్రదర్శించడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం మాండరిన్ నేర్చుకోవడం కేవలం ఉద్యోగం, వ్యాపారం కోసం చేసే పెట్టుబడి కాదు. భాషతో పాటు ఒక దేశపు సంస్కృతి, ఆలోచనా విధానం, ప్రజలతో సంబంధాలను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏఐ అనువాదం పదాలను ఒక భాష నుంచి మరో భాషలోకి మార్చగలిగినా, మనుషుల మధ్య ఏర్పడే నమ్మకం, సాంస్కృతిక అవగాహన, ప్రత్యక్ష సంభాషణను పూర్తిగా భర్తీ చేయలేదనే వాదన ఉంది. ప్రపంచ కుబేరుల నిర్ణయం ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా మాండరిన్ నేర్చుకోవాలనే సందేశం కాదు. కానీ భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, సాంస్కృతిక అవగాహన, అనుకూలత, ప్రపంచంతో అనుసంధానం వంటి మానవ నైపుణ్యాలకు మరింత విలువ పెరగవచ్చనే సంకేతాన్ని మాత్రం ఇస్తోంది.